
తన మాట సూటిగా, బాట ముక్కుసూటిగా ఉంటుందని హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. ఇటీవల పద్మ భూషణ్ అవార్డు అందుకున్న సందర్భంగా ఎమ్మెల్యేగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో బాలకృష్ణకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పౌర సన్మాన సభ పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ ‘సినిమా ఈవెంట్ కంటే ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ధన్యవాదాలు.
నేను భగవంతుడికి అభిమానులకు మధ్య సందానకర్తని. ఎందుకంటే నాకు పద్మభూషణ్ వస్తే మీరు సొంతంగా భావించి ఇలా పండగలా జరుపుకుంటున్నారు. నాన్న తర్వాత మా అన్న హరికృష్ణ, ఆ తర్వాత నన్ను మీవాడిలా మీలో ఒకడిగా మీ గుండెల్లో పెట్టుకున్నందుకు ధన్యవాదాలు. ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. నాన్న శతజయంతి జరపుకోవడం, మూడోసారి నేను ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడం, బసవతారకం హాస్పిటల్ చైర్మన్ గా 15వ సంవత్సరంలో అడుగుపెట్టడం.. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ నాలుగు వరుస హిట్లు అందుకోవడం.. హీరోగా 50 ఏళ్లు పూర్తికావడం.. ఈ తరుణంలో పద్మభూషణ్ రావడం బాగుంది.
50 సంవత్సరాలుగా హీరోగా నటించిన నటుడు ప్రపంచంలో ఎవరూ లేరు. చాలామంది హీరోలు మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటించారు. కానీ నేను 50 ఏళ్లు హీరోగా నిలబడటానికి శక్తినిచ్చిన తెలుగు జాతికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఏం చూసుకుని.. బాలకృష్ణకు అంత పొగరు అని అందరు అంటుంటారు. నన్ను చూసుకునే నాకు పొగరు అని నేను అంటాను’ అని అన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన బోయపాటి దర్శకత్వంలో ‘అఖండ2’లో నటిస్తున్నారు.