బింబిసార అద్భుతమైన సినిమా

బింబిసార అద్భుతమైన సినిమా

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ‘బింబిసార’ సినిమాను హీరో నందమూరి బాలకృష్ణ వీక్షించారు. శనివారం థియేటర్ లో మూవీని చూసిన తర్వాత.. చిత్ర టీమ్ ను అభినందించారు. నా కల నిజమైందని, నా హీరో..నటసింహం నేరుగా వచ్చి చిత్రాన్ని చూడడం జరిగిందని దర్శకుడు వశిష్ట చెప్పారు. నందమూరి కళ్యాణ్ రామ్, బాలకృష్ణలతో దిగిన ఫొటోలను వశిష్ట సోషల్ మీడియాలో పోస్టు చేశారు. విలువైన సమయాన్ని వెచ్చించి ‘బింబిసార’ను చూసినందుకు బాలకృష్ణకు ధన్యవాదాలు తెలియజేశారు.

వశిష్ట పోస్ట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దర్శకుడు వశిష్ట తెరకెక్కించిన ‘బింబిసార’ ఆగస్టు 5వ తేదీన విడుదలై హిట్ టాక్ తో దూసుకుపోతోంది. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సోషియో ఫాంటసీగా రూపొందిన బింబిసార సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది. బింబిసార పాత్రకు సంబంధించిన ప్రతి సీన్ అలరిస్తుండడంతో కళ్యాణ్ రామ్ ఎంటరైన ప్రతిసారీ ప్రేక్షకుడికి జోష్ వస్తుంది. ఆ క్రెడిట్ మొత్తం దర్శకుడికే దక్కుతుంది. మొదటి సినిమానే అయినా తన రైటింగ్‌తో ఇంప్రెస్ చేశాడు. డైరెక్టర్‌‌గానూ ఫుల్‌ మార్కులు సంపాదించాడు.

బాలకృష్ణ విషయానికి వస్తే గోపిచంద్ మలినేని దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమా చేస్తున్నారు. ఇది తుది దశకు చేరుకుంది. ఈ సినిమాలో విలన్ గా కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నారు. పవర్ ఫుల్ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించనున్నారు. బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. బాలయ్య నటించనున్న 108వ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ కు ఎంటర్ టైనర్ గా రూపొందనుంది. ఇటీవలే ఓ స్పెషల్ గింప్ల్స్ ను రిలీజ్ చేశారు.