బర్త్, డెత్ సర్టిఫికెట్ల సాఫ్ట్​వేర్​ను సక్కదిద్దుతున్న బల్దియా

బర్త్, డెత్ సర్టిఫికెట్ల సాఫ్ట్​వేర్​ను సక్కదిద్దుతున్న బల్దియా

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీలో బర్త్, డెత్ ఫేక్ సర్టిఫికెట్లపై విజిలెన్స్​విచారణ అనంతరం బల్దియా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మరోసారి ఇలాంటి తప్పిదాలు జరగకుండా జీహెచ్ఎంసీ కమిషనర్ చర్యలు తీసుకుంటున్నారు. నేరుగా సర్టిఫికెట్ల జారీకి సంబంధించి మీ సేవ కేంద్రాలకు ఉన్న బాధ్యతలను తొలగించారు. మళ్లీ మునుపటిలాగానే అసిస్టెంట్ మెడికల్ హెల్త్​ఆఫీసర్(ఏఎంవోహెచ్)కు తిరిగి ఈ బాధ్యతలు అప్పగించారు.

ఏఎంవోహెచ్​లు పరిశీలించి, వెరిఫై చేసిన తర్వాతే మీసేవ కేంద్రాలు జారీ చేసేలా మార్పులు చేశారు. హాస్పిటల్ లో పుట్టడం, చనిపోయినవారికి సంబంధించి మాత్రమే ఇకపై ఎలాంటి విచారణ లేకుండా నేరుగా సర్టిఫికెట్లు పొందవచ్చు. ఇంట్లో జన్మించిన లేదా చనిపోయిన వారితో పాటు, ఏడాది తరువాత నాన్ అవేలబిలిటీ(ఎన్ఏ) కింద దరఖాస్తులు చేసుకుంటున్న వారి అప్లికేషన్లపై పూర్తి విచారణ జరిపిన తర్వాతే ఏఎంవోహెచ్ లు అప్రూవల్ ఇచ్చేలా ‘ఇన్ స్టంట్’ సాఫ్ట్ వేర్ లో మార్పులు చేశారు.

800 మీసేవ కేంద్రాలపై కేసులు వేయండి

గ్రేటర్ పరిధిలో దాదాపు 800 మీసేవ కేంద్రాల్లో ఫేక్ సర్టిఫికెట్ల దందా కొనసాగినట్లు గుర్తించిన అధికారులు వాటిపై కేసులు నమోదు చెయ్యాలని ఇప్పటికే ఏఎంవోహెచ్ లకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా అక్రమాలకు పాల్పడిన మీసేవ నిర్వాహకులకు సంబంధించి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లకు వివరాలు కూడా వర్చువల్ గా అందజేశారు. ఇప్పటికే కొన్ని మీసేవాలపై కేసులు నమోదయ్యాయి. అక్రమాలకు చెక్​పెట్టేలా ఫేక్ సర్టిఫికెట్లు జారీ చేసిన ప్రతి మీసేవ కేంద్రంపై కేసులు నమోదు చేయిస్తామని బల్దియా ఉన్నతా ధికారులు చెబుతున్నారు.

రద్దు చేసిన సర్టిఫికెట్లకు మళ్లీ దరఖాస్తులు

రద్దు చేసిన 22 వేల బర్త్, డెత్ సర్టిఫికెట్లను తిరిగి పొందేందుకు మరోసారి అప్లయ్ చేసుకోవాలని ఇప్పటికే జీహెచ్ఎంసీ ప్రకటించింది. అయితే రిజెక్ట్ అయిన సర్టిఫికెట్లు మొత్తం నాన్ అవేలబిలిటీ(ఎన్ఏ) కింద వచ్చిన దరఖాస్తులే. పుట్టిన, మరణించిన ఏడాది తర్వాత సర్టిఫికెట్ల కోసం అప్లయ్ చేసుకునేవారు ఎన్ఏ కింద మాత్రమే అప్లయ్ చేసుచేకునేందుకు వీలుంది. అది కూడా ఆర్డీవో నుంచి ప్రొసీడింగ్స్ తీసుకొని దాని ఆధారంగా సర్టిఫికెట్ల కోసం జీహెచ్ఎంసీకి అప్లయ్ చేసుకోవాలి.

అయితే రద్దయిన అందరూ ఆర్డివో ప్రొసీడింగ్స్​తో తిరిగి అప్లయ్ చేసుకోవాల్సి ఉంది. ఇప్పటికే కొందరు దరఖాస్తు చేసుకుంటుండటంతో వీటిని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి జారీ చేస్తున్నారు. ఇందుకు 15 రోజులకుపైగా సమయం పడుతోంది.

రిజెక్ట్ అయినట్లు సమాచారం అందించిన బల్దియా

బర్త్, డెత్ సర్టిఫికెట్లు అడ్డదారిలో పొందిన వారు ఇప్పటికే ఆ సర్టిఫికెట్లను వివిధ పనులకు వినియోగించారు. బర్త్ సర్టిఫికెట్​ను పాస్ పోర్టులు, స్కూల్స్, ఫారిన్​కు వెళ్లేందుకు తదితర వాటికి ఉపయోగించగా.. డెత్ సర్టిఫికెట్ తో ఇన్సూరెన్స్, వారసత్వ సర్టిఫికెట్లు పొందేందుకు తదితర వాటికి దరఖాస్తులు చేసుకున్నారు. కాగా ఇప్పుడు ఆ సర్టిఫికెట్లు రద్దయ్యాయని జీహెచ్ఎంసీ అందరికీ సమాచారం అందించింది.

రిజెక్ట్ అయిన సర్టిఫికెట్లను దేనికోసమైనా వినియోగించేందుకు ప్రయత్నిస్తే చట్టపరంగా శిక్షార్హులు అవుతారని అధికారులు చెబుతున్నారు. తిరిగి మళ్లీ దరఖాస్తు చేసి, కొత్త సర్టిఫికెట్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. సాఫ్ట్​వేర్ అప్​డేట్​కు సంబంధించిన ప్రక్రియ నడుస్తుండటంతో నాలుగైదు రోజులుగా సర్టిఫికెట్ల జారీకి సంబంధించి ఇబ్బంది తలెత్తుతోంది. ఇకపై ఇబ్బందులు లేకుండా సర్టిఫికెట్ల జారీ పారదర్శకంగా జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.