చెన్నూరులో బాల్క సుమన్​కు నిరసన సెగ

చెన్నూరులో బాల్క సుమన్​కు నిరసన సెగ
  •     డ్రైనేజీ సమస్య పరిష్కారం కాలేదంటూ నిలదీత   
  •     తిరిగి వెళ్లిపోయిన ఎమ్మెల్యే 
  •     మళ్లీ వచ్చి బుజ్జగించిన సుమన్​

జైపూర్ (భీమారం) వెలుగు : మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎంఎల్ఏ బాల్క సుమన్​కు ఎన్నికల ప్రచారంలో మొదటి రోజే నిరసన సెగ తగిలింది. శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కలిసి భీమారంలోని ముదిరాజ్ కాలనీ నుంచి ప్రచారం ప్రారంభించారు. అక్కడి నుంచి లంబాడీ తండాకు వెళ్తుండగా తండావాసులు అడ్డుకున్నారు. 

తమ కాలనీలోని  డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, మురుగు నిలిచి దోమలు పెరిగి రోగాల బారిన పడుతున్నామన్నారు. ఎవరికీ చెప్పినా పట్టించుకోవడం లేదని బాల్క సుమన్ ​ముందు నిరసన తెలిపారు. ప్రచార వాహనాన్ని ముందుకు కదలనియ్యలేదు. దీంతో చేసేదేమీ లేక ఆయన తిరిగి వెళ్లిపోయి ఎస్సీ కాలనీలో ప్రచారం చేశారు. అక్కడి నుంచి వేరే దారిలో మళ్లీ లంబాడి తండాకు చేరుకున్నారు. తండావాసులను బుజ్జగించి త్వరలోనే డ్రైనేజీ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చి 
వెళ్లిపోయారు.  

ఎమ్మెల్యే చిన్నయ్యను అడ్డుకున్న కార్యకర్తలు 

బెల్లంపల్లి :  తమ ఇండ్ల స్థలాలకు పట్టాలు ఎందుకు ఇప్పించలేదని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో శుక్రవారం ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బస్తీ ప్రజలు నిలదీశారు. పట్టణంలోని ఏడో వార్డులో ఉన్న 2 ఇంక్లైన్ బస్తీకి రాగా ఇండ్ల పట్టాల విషయంలో తమకు ఎందుకు అన్యాయం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. 

దీంతో ఎమ్మెల్యే చిన్నయ్య ‘మీ వార్డులో కాంగ్రెస్ కౌన్సిలర్​గా గెలిపించిన్రు. బీఆర్​ఎస్​ క్యాండిడేట్​ను ఎందుకు గెలిపించలే.. నేనేం చేయాలె. ఈ సారి నన్ను గెలిపించండి. తర్వాత పట్టాలు వస్తాయి’ అని సమాధానంమిచ్చారు. ఇది విన్న వాళ్లంతా విస్తుపోగా, ఆయన అక్కడి నుంచి వేరే చోటికి ప్రచారానికి వెళ్లిపోయారు.