బ‌ల్కంపేట ఎల్లమ్మ క‌ల్యాణ మ‌హోత్సవం

బ‌ల్కంపేట ఎల్లమ్మ క‌ల్యాణ మ‌హోత్సవం

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం సందర్భంగా ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మంగళవారం అమ్మవారి కల్యాణం, బుధవారం రథోత్సవం సందర్భంగా వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని సూచిస్తున్నారు. గ్రీన్ ల్యాండ్స్, దుర్గామాత టెంపుల్, సత్యం థియేటర్ వైపు నుంచి ఫతేనగర్ వైపు వెళ్లే వాహనాలు ఎస్ఆర్ నగర్ టీ జంక్షన్ నుంచి ఎస్ఆర్ నగర్ కమ్యూనిటీ హాల్, అభిలాష టవర్స్, బీకేగూడ ఎక్స్ రోడ్డు, శ్రీరామనగర్ ఎక్స్ రోడ్డు, సనత్ నగర్ రోడ్డు మీదుగా వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. ఫతేనగర్ వైపు నుంచి బల్కంపేట వైపు వచ్చే వాహనాలు బల్కంపేట వైపు  అనుమతించరు. వాహనదారులు బల్కంపేట-బేగంపేట లింక్ రోడ్డులోకి మళ్లించి కట్టమైసమ్మ టెంపుల్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. గ్రీన్ ల్యాండ్స్ బకుల్ అపార్ట్మెంట్స్, ఫుడ్ వరల్డ్ వైపు నుంచి వచ్చే వాహనాలను బల్కంపేట వైపు అనుమతించరు. వాహనదారులు ఫుడ్ వరల్డ్ ఎక్స్ రోడ్డు నుంచి సోనాబాయి టెంపుల్, సత్యం థియేటర్, మైత్రివనం, ఎస్ఆర్ నగర్ టీ జంక్షన్ వైపు వెళ్లాల్సి ఉంటది. ఎస్సార్ నగర్ టీ జంక్షన్ నుంచి ఫతేగర్ వైపు వెళ్లే బై-లేన్స్, లింక్ రోడ్లను మూసివేశారు.

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.ఉత్తరానక్షత్ర యుక్త కన్యాలగ్న సుముహుర్తాన ఉదయం 11 గంటల 45 నిమిషాలకు కల్యాణం జరగనుంది. దేవస్థానం ముందు ఉన్న రాజమార్గంలో ఏర్పాటు చేసిన కల్యాణ మండపంలో కల్యాణం నిర్వహించనున్నారు. అమ్మవారికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు. మంత్రి తలసాని అమ్మవారి కల్యాణ ఏర్పాట్లును స్వయంగా పర్యవేక్షించారు. నిన్నటి నుంచి కల్యాణ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం ఎల్లమ్మ అమ్మవారిని పెళ్లికుమార్తెను చేశారు. రాత్రి 7 గంటలకు గణపతి పూజలు.. తర్వాత ఎదుర్కోలు కార్యక్రమం జరిగింది.