భారత్ లో బ్యాన్ తుర్కియే.. దెబ్బకు రూ.1000కోట్ల లాస్!

భారత్ లో బ్యాన్ తుర్కియే.. దెబ్బకు రూ.1000కోట్ల లాస్!
  • పండ్ల దిగుమతిపై నీలినీడలు
  • యాపిల్స్, చెర్రీస్, ప్లమ్స్, పియర్ ఫ్రూట్స్ బంద్
  • దిగుమతికి నిరాకరిస్తున్న పుణె వ్యాపారులు


పుణె: భారత్–పాకిస్తాన్ ఉద్రిక్తతల క్రమంలో తుర్కియే పాక్ కు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో ‘బ్యాన్ తుర్కియే’ ట్రెండింగ్ లోకి వచ్చింది.  దీని ప్రభావం ఆ దేశ యాపిల్స్ వ్యాపారంపై పడింది. ఆ దేశం నుంచి యాపిల్స్ దిగుమతిని పుణే వ్యాపారులు  బహిష్కరించారు. ఫలితంగా పుణెలోని మార్కెట్ యార్డుల్లో తుర్కియే యాపిల్స్ కనుమరుగయ్యాయి. పుణె మార్కెట్ కమిటీ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి యాపిల్స్​ను దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. మరీ ముఖ్యంగా తుర్కియే నుంచి పెద్ద మొత్తంలో యాపిల్స్​ను దిగుమతి చేసుకుంటుంది.  

దానికి బదులుగా ఇతర దేశాల నుంచి వచ్చే యాపిల్స్​ను దిగుమతి చేసుకుంటున్నారు. ‘ ప్రస్తుతం తుర్కియే నుంచి యాపిల్స్ బాగా వస్తున్నాయి. వచ్చే రెండు వారాల్లో చెర్రీస్, ప్లమ్స్, పియర్​ పండ్లు వస్తాయి. వాటి సీజన్ దాదాపు మూడు నెలలు ఉంటుంది. అయితే, తుర్కియే బహిరంగంగా పాకిస్థాన్​కు మద్దతు ఇచ్చిన కారణంగా, ప్రజలు 'బ్యాన్ తుర్కియే' అంటున్నారు. తుర్కియే యాపిల్స్ కొనుగోళ్లను వ్యతిరేకిస్తున్నారు. వాస్తవానికి వచ్చే మూడు నెలల్లో దాదాపు రూ.1000 టర్నోవర్ జరుగుతుంది, కానీ తుర్కియేపై నిషేధం కారణంగా దీనిపై ప్రభావం పడే అవకాశం ఉంది' అని సుయోగ్ జోడే అనే యాపిల్స్ వ్యాపారి తెలిపారు.