
- పోలవరంపూర్తయ్యాకే పరిశీలించవచ్చు`
- సీడబ్ల్యూసీకి పోలవరం ప్రాజెక్టు అథారిటీ లేఖ
- పీబీ లింక్ పోలవరం డీపీఆర్‌కు విరుద్ధం
- ఏపీ అది చేపడితే పోలవరానికి కొత్త డీపీఆర్ ఇవ్వాల్సిందే
- దీని ద్వారా తరలించాలనుకునే 200 టీఎంసీలపైనా స్టడీ చేయించాలి
- పీబీ లింక్‌తో పోలవరం ప్రాజెక్టు పరిమితులన్నీ మారిపోతయ్
- తాడిపూడి కెనాల్ కూడా పోలవరం ప్రాజెక్టులో భాగమేనని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఏపీ నిర్మించ తలపెట్టిన పోలవరం–బనకచర్ల లింక్ ఇప్పుడు సాధ్యం కాదని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) తేల్చి చెప్పింది. ఈ ప్రాజెక్టు ద్వారా తరలించాలని అనుకుంటున్న 200 టీఎంసీలు.. పోలవరం ప్రాజెక్టు ఒరిజినల్ డీపీఆర్‌లో భాగం కాదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆ 200 టీఎంసీలపై సరైన సంస్థతో కేంద్రం సమగ్ర అధ్యయనం జరిపించాలని సూచించింది.
ఆ సమయంలో ట్రిబ్యునల్ అవార్డు, డిపెండబుల్ వాటర్, అంతర్రాష్ట్ర వివాదాలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పింది. ఒకవేళ ఏపీ పీబీ లింక్ చేపడితే పోలవరం ప్రాజెక్టుకు కచ్చితంగా కొత్త డీపీఆర్ సమర్పించాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈ మేరకు సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ)కు పీపీఏ ఇటీవల లేఖ రాసింది. ఇందులో బనకచర్ల ప్రాజెక్టుపై తన అభిప్రాయాలను వెల్లడించింది. ప్రస్తుతం పోలవరం కింద బనకచర్ల లింక్ సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదని లేఖలో పీపీఏ పేర్కొంది. ‘‘ప్రాజెక్ట్ తొలి దశ (41.15 మీటర్ల ఎత్తు) ఖర్చును కేంద్రం రూ.30,436.95 కోట్లకు సవరించింది. ఈ ఫేజ్ 1లో బనకచర్ల లింక్ సాధ్యం కాదు. పూర్తి స్థాయి సామర్థ్యమైన 45.72 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టును పూర్తి చేశాకే బనకచర్ల లింక్ ప్రాజెక్టును పరిగణనలోకి తీసుకునేందుకు అవకాశం ఉంటుంది” అని తెలిపింది.
ఆపరేషన్ షెడ్యూల్‌పై స్టడీ చెయ్యాల్సిందే..
గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం.. వర్షాకాలంలో ప్రాజెక్టుల ఆపరేషన్ షెడ్యూల్‌ను నిర్వహించాల్సి ఉంటుందని, ఇప్పుడు బనకచర్లతో 200 టీఎంసీలపైనా ఆపరేషన్ షెడ్యూల్‌ను నిర్వహించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ స్పష్టం చేసింది. “పీబీ లింక్‌లో భాగంగా పోలవరం నుంచి 18,000 క్యూసెక్కులు తరలించేలా కొత్త కాల్వను నిర్మించి, దాన్ని తాడిపూడికి కలపాలని భావిస్తున్నారు. అది పూర్తయ్యేవరకు పోలవరం కుడి కాల్వ నుంచి నీళ్లు తరలించేందుకు కెపాసిటీని 23,000 క్యూసెక్కులకు పెంచుతున్నారు. ఇవన్నీ పోలవరం ప్రాజెక్టు డీపీఆర్‌కు విరుద్ధం. కాబట్టి ఏపీ కచ్చితంగా పోలవరం ప్రాజెక్టుపై కొత్త డీపీఆర్ సమర్పించాలిసిందే” అని స్పష్టం చేసింది.
తాడిపూడి కెనాల్ ద్వారానే బనకచర్లకు నీళ్లు..
ప్రస్తుతం తాడిపూడి కెనాల్ సిస్టం ద్వారా 2 లక్షల ఎకరాలకు సాగు నీళ్లు ఇవ్వడంతో పాటు 130 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారని పోలవరం ప్రాజెక్టు అథారిటీ తెలిపింది. అయితే పోలవరం పూర్తయ్యాక తాడిపూడి కూడా ఆ ప్రాజెక్టులో భాగంగా మారుతుందని పేర్కొంది. “పోలవరం ఫేజ్ 1లో ఆ ప్రాజెక్ట్ కుడి కాలువను తాడిపూడి కెనాల్‌తో లింక్ చేస్తున్నారు. తద్వారా గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకుపోవాలని భావిస్తున్నారు. కానీ, ఇప్పుడు బనకచర్ల లింక్ పేరిట 200 టీఎంసీలను ఈ వ్యవస్థ ద్వారానే తరలించనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంత మేర లాభం కలుగుతుందో సమగ్రమైన అధ్యయనం అవసరం” అని పేర్కొంది.