బీసీ రిజర్వేషన్లపై కేంద్రంతో మాట్లాడతా

బీసీ రిజర్వేషన్లపై కేంద్రంతో మాట్లాడతా
  • బీసీలకు న్యాయం జరిగేలా చూస్తా: బండారు దత్తాత్రేయ
  • ధర్నా చౌక్‌ వద్ద ఎర్ర సత్యనారాయణ దీక్షకు మద్దతు 

ముషీరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినా, ఫైనల్‌గా కేంద్రం చేతుల్లోనే ఉంటుందని, ఆ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేసేందుకు కృషి చేస్తానని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. శనివారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ 24 గంటల నిరసన దీక్ష చేపట్టారు. దీనికి దత్తాత్రేయతో పాటు ఎమ్మెల్సీ మధుసూదనా చారి, జస్టిస్ చంద్రకుమార్, జాజుల శ్రీనివాస్ గౌడ్ హాజరై మద్దతు తెలిపారు.

 దత్తాత్రేయ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి జీవో జారీ చేసిందని, కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ 9లో చేర్చేలా తాను కృషి చేస్తానని చెప్పారు. మధుసూదనా చారి మాట్లాడుతూ.. బీసీ బిల్లును షెడ్యూల్‌ 9లో చేరిస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. జాజుల మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎర్ర సత్యనారాయణ మాట్లాడుతూ.. 42% బీసీ రిజర్వేషన్లపై బీజేపీ  చేతులెత్తివేయడంతో ఆ పార్టీల నిజ స్వరూపం బయటపడిందన్నారు.