గొడవను ఆపేందుకు వెళ్తే..పొడిచి చంపారు.. భద్రాచలం టౌన్లో కలకలం రేపిన ఘటన

గొడవను ఆపేందుకు వెళ్తే..పొడిచి చంపారు.. భద్రాచలం టౌన్లో కలకలం రేపిన ఘటన
  • మద్యం మత్తులో స్క్రూ డ్రైవర్​తో వ్యక్తిని పొడిచి పారిపోయిన యువకులు

భద్రాచలం, వెలుగు: ఇరువర్గాల మధ్య గొడవను ఆపేందుకు వెళ్లిన వ్యక్తి హత్యకు గురైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. భద్రాచలం టౌన్ చర్ల రోడ్డులోని కేకే ఫంక్షన్​హాల్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం 3 గంట ల సమయంలో రెండు బైకులు  ఢీకొన్నాయి. 

దీంతో రెండు బైక్ లపై వెళ్లే గుర్తు తెలియని ఆరుగురు యువకులు మద్యం మత్తులో ఘర్షణకు దిగారు. అదే ప్రాంతానికి చెందిన సజ్జా రవి(40) అనే వ్యక్తి వెళ్లి ఇరువర్గాలను ఆపేందుకు యత్నించాడు. మద్యం మత్తులో ఉన్న యువకులు రవిని తమ వద్ద ఉన్న స్క్రూ డ్రైవర్​తో గుండెలో రెండు చోట్ల పొడిచారు. తీవ్రంగా గాయపడిన రవిని ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడు. 

గొడవ పడి తలలు పగిలి గాయపడిన యువకులు అక్కడి నుంచి పారిపోయారు. పాల్వంచకు చెందిన రవి భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి భద్రాచలం టౌన్ రాజుపేట కాలనీలో ఉంటూ జామాయిల్​కర్ర మారు బేరం చేస్తున్నాడు.  డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. 

ఏఎస్పీ విక్రాంత్​కుమార్​సింగ్​ఆదేశాల తో సీఐ నాగరాజు ఆధ్వర్యంలో పోలీసు టీమ్ లు పరారైన యువకుల కోసం గాలింపు చేపట్టాయి. మృతుడి భార్య, పిల్లల రోదనలతో ఏరియా ఆస్పత్రి వద్ద విషాదం నెలకొంది.