
- అప్పుడే న్యాయపరమైన చిక్కులు ఉండవు: మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
- పార్టీలకతీతంగా ముందుకు రావాలి: మంత్రి వాకిటి
- బీసీలందరూ ఉద్యమించాలి: ఎంపీ ఆర్.కృష్ణయ్య
- బీసీలకు ప్రాధాన్యత కల్పించాలి: ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
- బీసీ రిజర్వేషన్లపై రౌండ్ టేబుల్ మీటింగ్
హైదరాబాద్/బషీర్ బాగ్, వెలుగు: 42 శాతం బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకురావడం అభినందనీయమని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. తెలంగాణ ఉద్యమం తరహాలో బీసీలందరూ ఉద్యమిస్తేనే రిజర్వేషన్లకు చట్టబద్ధత దక్కుతుందని తెలిపారు. బిల్లును పార్లమెంట్ ఆమోదిస్తే ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు ఉండవని అన్నారు. హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని ఓ హోటల్ లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, ప్రధాన కార్యదర్శి కోలా జనార్ధన్ ఆధ్వర్యంలో బీసీ ప్రజా ప్రతినిధుల, కుల సంఘాల అఖిలపక్షాల సమావేశం ఆదివారం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ ముందుకు రావాలన్నారు. ‘‘మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలుకు మా ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది. నేను ఇక్కడికి ఓ మంత్రిగా కాకుండా.. బీసీ బిడ్డగా వచ్చిన. సీఎం రేవంత్ నేతృత్వంలో బీసీల రిజర్వేషన్లపట్ల చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నాం.
ఒక్కో అడ్డంకిని దాటుకుంటూ రిజర్వేషన్లపై జీవో తీసుకొచ్చినం. దాన్ని అడ్డుకోవడానికి కొంతమంది కోర్టులకు వెళ్లారు. ప్రభుత్వం తరఫున న్యాయపోరాటం చేసి 42% రిజర్వేషన్లను ఖచ్చితంగా అమలు చేస్తాం. ప్రతిపక్షాలు దీన్ని రాజకీయం చేయొద్దు’’అని మంత్రి వాకిటి కోరారు. 42 శాతం రిజర్వేషన్లపై క్రెడిట్ ఎవరికి వచ్చినా.. అంతిమంగా బీసీలకు న్యాయం చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. బిల్లు ఇప్పుడు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందన్నారు.
సలహాలిస్తే స్వీకరిస్తాం
రాష్ట్ర ప్రభుత్వంపై కొంతమంది కావాలనే బట్ట కాల్చి మీద వేస్తున్నారని మంత్రి వాకిటి మండిపడ్డారు. ‘‘తెలంగాణ కోసం ఎలా అయితే ఉద్యమించామో.. అలాగే బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధత కోసం పోరాడాలి. అన్ని పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. రిజర్వేషన్లు సాధించేందుకు ఎంతవరకైనా వెళ్తాం. సలహాలు ఇవ్వాలనుకుంటే స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. కులాల వారీగా ఎవరికివారు విడిపోతే అనుకున్నది సాధించలేం’’అని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ప్రజా ఉద్యమం ద్వారానే కోర్టులు దిగొస్తాయని ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు. ఆ దిశగా బీసీలంతా ముందుకు రావాలని సూచించారు.
బీసీ ఉద్యమం.. దేశానికి మార్గదర్శకం కావాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ముందు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య కోరారు. అలాగే, చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్‌తో పాటు విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో బీసీలకు సముచిత ప్రాతినిథ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీలు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తేనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందన్నారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, చెరుకు సుధాకర్ గౌడ్ తో పాటు పలువురు బీసీ సంఘాల నేతలు, మేధావులు పాల్గొన్నారు.