రాష్ట్రంలో ప్రతి పనిలో 60% కమీషన్లు.. వచ్చే ఎన్నికల్లో 85 సీట్లలో గెలుస్తం

రాష్ట్రంలో ప్రతి పనిలో 60% కమీషన్లు.. వచ్చే ఎన్నికల్లో 85 సీట్లలో గెలుస్తం
  • కేసీఆర్ కుటుంబానికి 30%.. ఎమ్మెల్యేలకు 30%: సంజయ్ 
  • బీఆర్ఎస్, కాంగ్రెస్​ది ఫెవికాల్ బంధం
  • కాంగ్రెస్​ను జాకీలు పెట్టి లేపినా లేవదని కామెంట్  
  • వనపర్తి జిల్లా ఆత్మకూరులో బీజేపీ బహిరంగ సభ

ఆత్మకూర్, వెలుగు: రాష్ట్రంలో ప్రతి పనికి బీఆర్ఎస్ సర్కార్ కమీషన్లు తీసుకుంటున్నదని, రాష్ట్ర సంపదను దోచుకుంటున్నదని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. ‘‘అభివృద్ధి పనుల అంచనాలను పెంచి 60 శాతం కమీషన్లు తీసుకుంటున్నారు. అందులో కేసీఆర్ కుటుంబానికి 30 శాతం, ఎమ్మెల్యేలకు 30 శాతం ముడుతున్నది” అని చెప్పారు. 

మహా జన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం రాత్రి వనపర్తి జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని ఆత్మకూర్ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో బహిరంగ సభ నిర్వహించారు. దీనికి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఒకప్పుడు ఏమీ లేని కేసీఆర్ కు.. ఇప్పుడు వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ‘‘బీఆర్ఎస్ పాలనలో మద్యం ఏరులై పారుతున్నది. మద్యం ద్వారానే ఏటా దాదాపు రూ.40 వేల కోట్ల ఆదాయం వస్తున్నది. రాష్ట్రంలోని సబ్బండ వర్గాలు అల్లాడుతుంటే వందల కోట్ల ప్రజా ధనంతో కేసీఆర్ తన పార్టీ డబ్బా కొట్టుకుంటున్నారు. దోచుకున్న సొమ్ముతో పక్క రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నారు. రూ.5 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించారు” అని ఫైర్ అయ్యారు. 

బీజేపీపై కేసీఆర్ కుట్ర.. 

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి తథ్యమని, సీఎం కేసీఆర్‌‌‌‌ను ఇంటికి పంపేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని సంజయ్ అన్నారు. ‘‘వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరేస్తం. మా పార్టీ 85 స్థానాల్లో గెలుస్తుందని సర్వే రిపోర్టులు చెబుతున్నాయి” అని తెలిపారు. రాష్ట్ర బీజేపీపై కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ‘‘తెలంగాణ బీజేపీలో ఏదో జరుగుతున్నదని తప్పుడు ప్రచారం తెరపైకి తెచ్చారు. ఈ ఫేక్​ప్రచారానికి కేరాఫ్​అడ్రస్​కేసీఆరే. రాష్ట్రంలో బీఆర్ఎస్​కు ప్రత్యమ్నాయం బీజేపీనే. బీజేపీ బలంగా మారడంతో కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారు” అని అన్నారు. 

కాంగ్రెస్, బీఆర్ఎస్ ది ఫెవికల్ బంధమని.. పినాయిల్​తో కడిగినా ఆ పార్టీల బంధం చెదిరిపోదని కామెంట్ చేశారు. ‘‘కర్నాటక ఎన్నికల ఫలితాలకు, తెలంగాణ ఎన్నికలకు సంబంధమే ఉండదు. కర్నాటకలో కాంగ్రెస్ గెలిస్తే.. దేశమంతటా గెలిచినట్లు హడావుడి చేస్తున్నారు. కాంగ్రెస్ బలంగా ఉంటే దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడులో ఆ పార్టీకి డిపాజిట్ ఎందుకు రాలేదు. తెలంగాణలో కాంగ్రెస్ ను జాకీలు పెట్టి లేపిన లేచే పరిస్థితి లేదు” అని అన్నారు.   ఎంఐఎంకు దమ్ముంటే రాష్ట్రంలోని 119 సీట్లలో పోటీ చేయాలని సవాల్ చేశారు. సభలో పార్టీ నేతలు జితేందర్ రెడ్డి, ఎద్దుల రాజవర్ధన్ రెడ్డి, పగుడాకుల శ్రీనివాస్, శాంతకుమార్, నాగురావు నామాజీ తదితరులు పాల్గొన్నారు.

రిటైర్డ్ అధికారులను అడ్డంపెట్టుకుని.. కోట్లు దోచుకుంటున్నరు

రాష్ట్రంలో రిటైర్డ్ అయిన 500 మంది అధికారులను అడ్డంపెట్టుకొని సీఎం కేసీఆర్ ఏటా రూ.వెయ్యి కోట్లు దోచుకుంటున్నారని బండి సంజయ్ ఆరోపించారు. సీఎంవోలో కొంత మంది అధికారుల తీరు కూడా అలాగే ఉందని మండిపడ్డారు. తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, ఇప్పటికైనా అలాంటి అధికారులు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ భవిష్యత్తు కోసం పని చేయాలని కోరారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీస్​లో సంజయ్ సమక్షంలో ఉమ్మడి ఏపీలో డీజీపీగా పనిచేసిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎస్​కె.జయచంద్ర, ఆయన కుమార్తె పాయల్ నేహా పార్టీలో చేరారు. 

ఈ సందర్భంగా మీడియాతో సంజయ్ మాట్లాడారు. బీజేపీ సిద్ధాంతాలు, మోదీ విధానాలు నచ్చి జయచంద్ర, ఆయన కూతురు పాయల్ నేహాలు బీజేపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. నిస్వార్థంగా పనిచేసే రిటైర్డ్ అధికారులు బీజేపీలో చేరడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో చాలా మంది నేతలు బీజేపీలో చేరబోతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి, అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాశ్, సంగప్ప ఉన్నారు.

నిజాయితీగా ఉండే గవర్నర్లు బీఆర్ఎస్​కు నచ్చట్లేదు

రబ్బర్ స్టాంపు మాదిరి ఉండే గవర్నర్లు మాత్రమే బీఆర్ఎస్​కు నచ్చుతారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. నిజాయితీగా ఉండే గవర్నర్ అధికార బీఆర్ఎస్​కు నచ్చడం లేదని విమర్శించారు. గవర్నర్‌‌‌‌ తమిళిసైపై మంత్రి హరీశ్‌‌‌‌ రావు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. గవర్నర్​ను హేళన చేయడం అంటే రాజ్యాంగాన్ని అవమానించడమే అవుతుందన్నారు. ‘‘బీఆర్ఎస్ చేస్తున్న అవినీతిని గవర్నర్ చూస్తూ ఊరుకోవాలా?. ప్రగతి భవన్​ను తాగి, తినడానికి మాత్రమే కేసీఆర్ ఉపయోగించుకుంటున్నారు. సీఎం ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు. అందుకే రాష్ట్ర ప్రజలు రాజ్​భవన్ ​వైపు చూస్తున్నారు. అసలు కేసీఆర్.. మహారాష్ట్రకు ముఖ్యమంత్రా.. తెలంగాణాకా?” అని సంజయ్ ప్రశ్నించారు.