కేంద్రం నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి: బండి సంజయ్

కేంద్రం నిధులతోనే  తెలంగాణలో అభివృద్ధి: బండి సంజయ్

ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి సీఎం  కేసీఆర్ కు నిద్ర పట్టడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రజలకిచ్చిన హామీల అమలు చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర  డబ్బులు లేవని విమర్శించారు. ప్రజాధనాన్ని లూటీ చేసి లక్ష కోట్లతో లిక్కర్ దందా చేస్తారా? అంటూ ప్రశ్నించారు. దేశమంతా కేసీఆర్ కుటుంబాన్ని చూసి అసహ్యించుకుంటోందన్నారు. లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితను సీబీఐ అరెస్ట్ చేస్తే తెలంగాణ సెంటిమెంట్ రగిలించాలని కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఖానాపూర్ లోని పెండింగ్ ప్రాజెక్టులు, బ్రిడ్జిలన్నీ పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. డిగ్రీ కాలేజీ, రెవిన్యూ డివిజన్ ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. 

 తాలు ధాన్యం పేరుతో టీఆర్ఎస్ నేతలు రైతులను ఘోరంగా మోసం చేస్తున్నారని  బండి సంజయ్ ఆరోపించారు. వడ్ల కొనుగోలు పైసలన్నీ మోదీ ప్రభుత్వమే ఇస్తోందన్నారు. గ్రామ పంచాయతీలకిచ్చే నిధులన్నీ కేంద్రానివే అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక, పేదలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తామని భరోసా కల్పించారు. నిలువ నీడలేని పేదలకు ఇండ్లు కట్టిస్తామని చెప్పారు. పంట నష్టపోయిన రైతులకు ఫసల్ బీమా యోజన పథకాన్ని పూర్తిగా అమలుచేసి, ఆదుకుంటామని చెప్పారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని.. ముఖ్యమంత్రిని అడిగే దమ్ము టీఆర్ఎస్ నేతలకు ఉందా? అని ప్రశ్నించారు.

కేంద్రం ఇస్తున్న నిధులతోనే... తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందని బండి సంజయ్ చెప్పారు. ధాన్యం సేకరణ కు నిధులు ఇస్తున్నది మోడీ ప్రభుత్వమే అని చెప్పారు. తెలంగాణ లో పేదోళ్ల రాజ్యం రావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం గా మార్చేశారని తెలిపారు. మూడోసారి  కేసీఆర్ కు అవకాశం ఇస్తే... ఇంకో రూ. 5 లక్షల కోట్ల అప్పు చేస్తారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం అక్రమంగా సంపాదించిన ఆస్తులతో... ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అద్దంలా అభివృద్ధి చేయవచ్చని చెప్పారు. ఖానాపూర్ గడ్డపై కాషాయ జెండా ఎగరేస్తామని స్పష్టం చేశారు.