కేసీఆర్ లాగా ధర్మాన్ని రాజకీయాల కోసం వాడుకోం : బండి సంజయ్

కేసీఆర్ లాగా ధర్మాన్ని రాజకీయాల కోసం వాడుకోం : బండి సంజయ్

వరంగల్ అర్బన్ : సెప్టెంబర్ 17ను తెలంగాణ పండుగగా అధికారికంగా నిర్వహించాలని బీజేపీ మొదటి నుండి ఉద్యమం చేస్తోందని… బీజేపీ టీడీపీ, కాంగ్రెస్  ఆధ్వర్యంలో.. ఆనాడు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండా ఎగరవేస్తామని చెప్పారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. హన్మకొండ బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్  ప్రెస్ మీట్ నిర్వహించారు. 17న అమిత్ షా రాక వాయిదా పడిందన్నారు. సెప్టెంబర్ 17 ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పారు. టీఆర్ ఎస్ పార్టీ ద్వంద్వ విధానాలను ప్రజలు అసహ్యించుకున్నారనీ.. వరంగల్ లో టీఆర్ఎస్ రజాకార్ల పాలన కొనసాగిస్తోందన్నారు. సాయిబాబా దేవాలయంలో పూజారి హత్య.. వినాయక మండపాల్లోకి వెళ్లి దాడులు చేసిన వారితో టీఆర్ ఎస్ అంటకాగడం.. .. రజాకార్ల పాలనకు నిదర్శనం అన్నారు.

టీఆర్ఎస్ పార్టీలో ఓనర్ల పంచాయతీ పక్కన పెట్టి … తెలంగాణ పండుగ 17 సెప్టెంబర్ పై మాట్లాడాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. సెప్టెంబర్ 17ను గతంలో నిర్వహించాలని చెప్పిన కేసీఆర్ ఇపుడు ఎందుకు వెనక్కి తగ్గారని ప్రశ్నించారు. సీఎం పదవి అధిష్టించిన వెంటనే.. నిజాం సమాధి వద్ద కేసీఆర్ మోకరిల్లిన రోజే.. ప్రజలు ఆయన్ను అసహ్యించుకున్నారని అన్నారు. తెలంగాణ వ్యతిరేక పార్టీ ఎంఐఎం… ఒత్తిడికి తలొగ్గి 17 సెప్టెంబర్ ను జరపకపోవడం సిగ్గు చేటన్నారు. తెలంగాణ ఉద్యమకారులను, వీరుల చరిత్రను కనుమరుగు చేయడానికి కేసీఆర్ కుట్ర పన్నారని అన్నారు.

“ధర్మం కోసం రాజకీయం చేస్తాం.. రాజకీయాల కోసం కేసీఆర్ లాగా ధర్మాన్ని వాడుకోం.. ధర్మం కోసం పని చేసే ఏకైక పార్టీ బీజేపీ.. టీఆర్ఎస్ లాగా కిరాయి ఉద్యమం మేం చేయం. నిజమైన తెలంగాణ ఉద్యమం బీజేపీ చేసింది. సెప్టెంబర్ 17న దేశ ప్రధాని నరేంద్ర మోడీ 69వ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ వారంరోజులు సేవ సప్తాహ నిర్వహిస్తున్నాం.  శనివారం నుంచి 20వ తేదీ వరకు హాస్పిటల్స్, అనాథ ఆశ్రమాలు, వసతి గృహాల్లో పండ్లు, సామాగ్రి అందిస్తాం. రక్తదాన్ శిబిరాలు.. వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తాం. ప్లాస్టిక్ నిషేధంపై పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తాం. మోడీ 100 రోజుల పాలనలో సాధించిన విజయాలు ప్రజలకు చేరవేయడానికి ఈ కార్యక్రమానికి పిలుపునిస్తున్నాం” అని చెప్పారు బండి సంజయ్.