బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సంజయ్.. కీలక నేతలకు పార్టీ పదవులు

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సంజయ్.. కీలక నేతలకు పార్టీ పదవులు
  •  జనరల్ సెక్రటరీలుగా తరుణ్ చుగ్, బన్సల్ కొనసాగింపు
  • జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ యాజ్ ఇట్ ఈజ్
  • 13 మంది వైస్ ప్రెసిడెంట్లు, 8 మంది జనరల్ సెక్రటరీల అపాయింట్ మెంట్
  • ఉత్తర్వులు జారీ చేసిన జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
  • ఎన్నికల దృష్ట్యా కీలక నేతలకు పార్టీ పదవులిచ్చిన బీజేపీ
  • తెలంగాణలో అధికారమే లక్ష్యంగా మార్పులు, చేర్పులు

హైదరాబాద్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ కుమార్ ను నియమించారు. ఇప్పటి వరకు ప్రధాన కార్యర్శులుగా కొనసాగుతున్న బీజేపీ తెలంగాణ ఇన్ చార్జులు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ ను కూడా జనరల్ సెక్రటరీలుగా కొనగిస్తూ పార్టీ  జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్ణయం తీసుకున్నారు. మరో కీలక నేత, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణను అదే పదవిలో కొనసాగిస్తున్నట్టు ఇవాళ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు బీజేపీ కేంద్ర కార్యాలయం ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. మొత్తం 13 ఉపాధ్యక్షులు, 8 మంది ప్రధాన కార్యర్శులను నియమిస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ఈ మార్పులకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి చెందిన డాక్టర్ కే లక్ష్మణ్​ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయనకు ఇటీవలే రాజ్యసభ ఎంపీ పదవిని కేటాయించారు. 

టార్గెట్ తెలంగాణ

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ జాతీయ నాయకత్వం ఈ మార్పులు చేసినట్టు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన బండి సంజయ్ గతంలో ఐదు విడుతల్లో పాదయాత్రలు చేశారు. దుబ్బాక, హుజూరాబాద్, నాగార్జునసాగర్, మునుగోడు ఉప ఎన్నికలతోపాటు జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లారనే పేరుంది. రాష్ట్రాధ్యక్షుడిని మార్చిన తర్వాత ఆయన వర్గం కొంత డోలాయమానంలో పడింది. ప్రస్తుతం జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో ఆయన వర్గంలో కొత్త జోష్ నెలకొంది. సాధారణంగా జాతీయ ప్రధాన కార్యదర్శుల సేవలను పార్టీ దేశ వ్యాప్తంగా వినియోగించుకుంటుంది. బండి సంజయ్ సేవలు తెలంగాణలోనే వినియోగించుకుటుందా..? వేరే ఏదైనా రాష్ట్రానికి బాధ్యుడిగా పంపుతుందా..? అనేది తేలాల్సి ఉంది.