బీజేపీ నేషనల్​ జనరల్​ సెక్రటరీగా.. బండి సంజయ్

బీజేపీ నేషనల్​ జనరల్​ సెక్రటరీగా.. బండి సంజయ్
  • బీజేపీ నేషనల్​ జనరల్​ సెక్రటరీగా.. బండి సంజయ్
  • తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ కొనసాగింపు
  • ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ కంటిన్యూ 
  • జాతీయ పదాధికారులను ప్రకటించిన హైకమాండ్  

న్యూఢిల్లీ, వెలుగు:  బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్​కి పార్టీ హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయనను నేషనల్ జనరల్ సెక్రటరీగా నియమించింది. పార్టీ జాతీయ పదాధికారులను బీజేపీ హైకమాండ్ శనివారం ప్రకటించింది. వీరిలో 13 మంది ఉపాధ్యక్షులు, 8 మంది నేషనల్ జనరల్ సెక్రటరీలు, జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత), జాతీయ ఉప ప్రధాన కార్యదర్శి (సంస్థాగత), 13 మంది సెక్రటరీలు, కోశాధికారి, సహ కోశాధికారి ఉన్నారు.

ప్రస్తుతం ఉపాధ్యక్షురాలిగా ఉన్న డీకే అరుణ, నేషనల్ జనరల్ సెక్రటరీ(సంస్థాగత)గా ఉన్న బీఎల్ సంతోష్, ఉప ప్రధాన కార్యదర్శి (సంస్థాగత)గా ఉన్న శివ ప్రకాశ్, నేషనల్ జనరల్ సెక్రటరీలుగా ఉన్న తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ ను తిరిగి అవే పదవుల్లో కొనసాగించారు. ఇక కొత్తగా ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ మాజీ వీసీ తారీఖ్ మన్సూర్ ను ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఈ ఏడాదే పార్టీలో చేరిన అనిల్ ఆంటోని (ఏకే ఆంటోని కొడుకు)కి సెక్రటరీగా బాధ్యతలు అప్పగించారు. కాగా, పశ్చిమ బెంగాల్ కు చెందిన దిలీప్ ఘోష్ ను ఉపాధ్యక్షపదవి నుంచి తొలగించారు. నేషనల్ జనరల్ సెక్రటరీలుగా ఉన్న సీటీ రవి (కర్నాటక), దిలీప్ సైకియా (అస్సాం)ను ఆ పదవుల నుంచి  తొలగించారు.  

దక్షిణాది నుంచి సంజయ్ ఒక్కరే..  

మొత్తం 8 మంది నేషనల్ జనరల్ సెక్రటరీలు ఉండగా, వారిలో దక్షిణాది నుంచి ఒక్క సంజయ్ కే అవకాశం దక్కింది. ఇంతకుముందు తెలంగాణ నుంచి మురళీధర్ రావు మాత్రమే నేషనల్ జనరల్ సెక్రటరీగా పని చేయగా, ఇప్పుడు సంజయ్ కి చాన్స్ దక్కింది. కాగా, సంజయ్ కి ఢిల్లీలోని బీజేపీ హెడ్ ఆఫీసులో చాంబర్ కేటాయించనున్నారు. నేషనల్ జనరల్ సెక్రటరీగా పని చేసిన పురందేశ్వరీ.. ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఇప్పుడు ఆమె చాంబర్ ను  సంజయ్ కి కేటాయించనున్నట్లు తెలిసింది.

హైకమాండ్​కు సంజయ్ కృతజ్ఞతలు.. 

జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు బీజేపీ హైకమాండ్ కు సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ధన్యవాదాలు తెలిపారు. కింది స్థాయి నుంచి వచ్చిన తనకు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి దక్కడం గౌరవంగా భావిస్తున్నానని సంజయ్ శనివారం ట్వీట్ చేశారు.