కేసీఆర్ను ఈ రాష్ట్రం నుంచి ఎందుకు తొలగించొద్దు?: బండి సంజయ్

కేసీఆర్ను  ఈ రాష్ట్రం నుంచి ఎందుకు తొలగించొద్దు?: బండి సంజయ్

మంత్రి కేటీఆర్ ,బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో బీజేపీ ఎందుకుండాలని ప్రశ్నించిన కేటీఆర్ కు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు.  

‘ ఉద్యమకారులకు కేసీఆర్ తన  పార్టీలో చోటివ్వలేదు , దళితులకు మూడెకరాలు ఇవ్వలేదు,  దళితులకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు,  ఖాళీలున్నా ఉద్యోగాలను భర్తీ చెయ్యలేదు,  నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వలేదు, - దళితబంధు ఇవ్వలేదు,  పంచాయతీ, మున్సిపాలిటీలకు నిధులు ఇవ్వలేదు,  ప్రకటనలే తప్ప ఆలయాలకు సైతం కేసీఆర్ నిధులియ్యలేదు.  ముఖ్యమంత్రి ప్రధాన బాధ్యతల్లో ప్రజలకు చోటివ్వన్నప్పుడు,  కేసీఆర్ ను ఎందుకు భరించాలి ? సహించాలి ? .  అసలు కేసీఆర్ తన పార్టీ నుంచే తెలంగాణను తొలగిస్తే..  ఆయనను ఎందుకు ఈ రాష్ట్రం నుంచి తొలగించకూడదు’’అని బండి సంజయ్ కేటీఆర్ ను  ప్రశ్నించారు.

అంతకుముందు కేటీఆర్ తన ట్విట్టర్లో..  తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ,  పసుపు బోర్డు, మెట్రో రెండో దశ, ఐటిఐఆర్ ప్రాజెక్టు, గిరిజన యూనివర్సిటీ,  బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ, ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చేది లేదని మోడీ చెప్పారని..  మోడీ ప్రాధాన్యతలో తెలంగాణ లేనప్పుడు.. తెలంగాణ ప్రాధాన్యతలో మోడీ ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో ఆ దిక్కుమాలిన పార్టీ ఎందుకుండాలని కేటీఆర్ ప్రశ్నించారు.