మేం అధికారంలోకొస్తే శానిటేషన్ కార్మికులకు రూ.2వేలు పెంచుతం : బండి సంజయ్

మేం అధికారంలోకొస్తే శానిటేషన్ కార్మికులకు  రూ.2వేలు పెంచుతం :  బండి సంజయ్
  • ఉద్యోగ భద్రత కల్పించి బోనస్ ఇస్తామని వెల్లడి
  • వెయ్యి రూపాయలతో ఒరిగేదేమీ లేదని కేసీఆర్‌‌‌‌పై ఫైర్
  • పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు: బీజేపీ అధికారంలోకి వస్తే శానిటేషన్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు రూ.2వేల చొప్పున వేతనం పెంచుతామని పార్టీ స్టేట్ చీఫ్, ఎంపీ బండి సంజయ్ హామీ ఇచ్చారు. తమ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిత్యం కష్టపడుతున్న కార్మికుల సేవలు వెలకట్టలేనివన్నారు. కరోనా టైంలో ప్రాణాలు పణంగా పెట్టి వర్క్ చేశారని కొనియాడారు. అలాంటి వారికి కేసీఆర్ కేవలం వెయ్యి రూపాయలు పెంచారని, దీంతో ఒరిగేదేంటని సంజయ్ ప్రశ్నించారు. ఉద్యోగ భద్రత ఎందుకు కల్పించడం లేదో కేసీఆర్ చెప్పాలని ప్రెస్​నోట్​లో మంగళవారం డిమాండ్​ చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న శానిటేషన్, స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ఎక్కువ రావడానికి ప్రధాన కారణం పారిశుధ్య కార్మికులేనని ప్రశంసించారు. పారిశుధ్య కార్మికుల్లో ఎక్కువ మంది దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల వాళ్లు ఉన్నారని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే దసరా, ఉగాది పండుగలకు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారు. 

రైతులను పట్టించుకోరా?

జలమండలి వద్ద నిరసన తెలియజేస్తున్న బీజేపీ కార్పొరేటర్లను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సంజయ్ ప్రకటించారు. నాలాల్లో, నీటి గుంతల్లో పడి పిల్లలు చనిపోతున్నా స్పందించరా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి పసిపిల్లలు బలవుతుంటే మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్​ ఏం చేస్తున్నారని నిలదీశారు. అకాల వర్షాలకు హైదరాబాద్ ఆగమవుతుంటే, జీహెచ్ఎంసీ, జల మండలి తీసుకున్న చర్యలేంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వడగండ్ల వానతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు నష్టపోతుంటే ప్రభుత్వం ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నించారు. ఎకరాకు సగటున రూ.50 వేలు నష్టపోయారని వివరించారు. ఎకరాకు రూ.10వేలు ఇస్తానంటూ మార్చిలో కేసీఆర్ ఇచ్చిన హామీ ఇంకా అమలు కాకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.

ఈ ప్రభుత్వం అవసరమా?

ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్ ఎగ్జామ్స్​లో ఎకనామిక్స్ క్వశన్ పేపర్‌‌‌‌ను తెలుగుకు బదులు ఇంగ్లీష్‌‌లో ఇవ్వడాన్ని సంజయ్ ఖండించారు. ఇంటర్ ఎగ్జామ్స్‌‌ కూడా సరిగా నిర్వహించలేని ప్రభుత్వం అవసరమా అని ప్రశ్నించారు. తెలుగు మీడియం స్టూడెంట్స్​కు ఇంగ్లీష్‌‌లో క్వశన్‌‌ పేపర్ ఇచ్చిన అధికారులు, తమ తప్పు దిద్దుకోకుండా వారిని ఇబ్బంది పెట్టడమేంటని ప్రశ్నించారు. ఇప్పటికే టీఎస్‌‌పీఎస్సీ పేపర్ లీకులతో లక్షలాది మంది నిరుద్యోగులు ఆగమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.