డాక్యుమెంట్లతో రా.. నా ఆస్తులన్నీ ప్రజలకు పంచుతా : బండి సంజయ్

డాక్యుమెంట్లతో రా.. నా ఆస్తులన్నీ  ప్రజలకు పంచుతా : బండి సంజయ్
  •     గంగులపై నిప్పులు చెరిగిన బండి సంజయ్

కరీంనగర్ సిటీ : 'కమలాకర్ నన్ను అవినీతిపరుడంటున్నాడు. నేను సవాల్ చేస్తున్న.. నేను అవినీతితో ఎంత ఆస్తి సంపాదించానో ఆ డాక్యుమెంట్లన్నీ తీసుకుని రా.. అవన్నీ కరీంనగర్  ప్రజలందరికీ రాసిస్తా... అలాగే నువ్వు సంపాదించిన ఆస్తుల డాక్యుమెంట్లన్నీ నేను తీసుకొస్తా. వాటిని ప్రజలకు రాసించే దమ్ముందా?' అంటూ బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్.. గంగుల కమలాకర్‌‌‌‌కు సవాల్ విసిరారు. ఆదివారం నియోజకవర్గంలోని బావూపేట, చింతకుంట, కమాన్ చౌరస్తాలో ఆయన ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ రేషన్ కార్డుల మంత్రిగా ఉండి ఎంతమందికి కార్డులిచ్చావని, బీసీ మంత్రిగా ఎంతమందికి బీసీ బంధు ఇచ్చావని ప్రశ్నించారు.  ఎంపీగా తాను పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.9 వేల కోట్ల నిధులు తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఇన్నాళ్లు కొండలు, గుట్టలు మాయం చేసి అడ్డగోలుగా సంపాదించి గంగుల గ్రానైట్ కార్మికుల సంఘం ఎన్నికలు జరగకుండా చేస్తున్నాడని, తనను గెలిపిస్తే గంగుల ఏకచ్ఛత్రాధిపత్యాన్ని బద్దలు కొడతానని, గ్రానైట్ యూనియన్ ఎన్నికలు జరిపిస్తానని హామీ ఇచ్చారు.

'నా కంటే గంగుల గొప్ప హిందువట. నువ్వు నిజంగా హిందువైతే  టోపీ పెట్టుకుని ముస్లింల ఓట్ల కోసం దారుస్సలాంపోయి ఎందుకు కాళ్లు మొక్కినవ్‌‌’ అని ప్రశ్నించారు. గుట్టలు, కొండలు మాయం చేసి పేదల ఇండ్లను లాక్కుని, భూకబ్జాలు చేసేటోడు హిందూ ధర్మ రక్షకుడైతడా?' ప్రశ్నించారు.  

బీఆర్ఎస్ అభ్యర్థులిద్దరూ నయీం బ్రదర్స్ అని సంజయ్ కుమార్ మండిపడ్డారు. తానేనాడు భూకబ్జాలు, అవినీతికి పాల్పడలేదన్నారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు మార్ఫింగ్‌‌లు చేసి వీడియో, ఆడియోలు సృష్టించి ప్రజలను గందరగోళంలో పడేసే కుట్రకు తెరదీశారని ఆరోపించారు.