రాజకీయం కోసం కేసీఆర్ కుటుంబ సభ్యులను వాడుకుంటుండు : బండి సంజయ్

రాజకీయం కోసం కేసీఆర్ కుటుంబ సభ్యులను వాడుకుంటుండు : బండి సంజయ్

రాజకీయం కోసం కుటుంబ సభ్యులను కూడా వాడుకునే దుర్మార్గుడు కేసీఆర్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆయన ఢిల్లీలో బీజేపీ నేతల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని, ఇప్పుడు కేసీఆర్ బిడ్డను పార్టీలో చేర్చుకుంటమా అని ప్రశ్నించారు. ఫాం హౌస్ ఇష్యూతో సంబంధమున్న నలుగురు ఎమ్మెల్యేలు ఎంత భయపడుతున్నరో వాళ్ల మొఖాలు చూస్తేనే అర్థమైతుందని అన్నారు. సీసీ ఫుటేజ్ రిలీజ్ చేయాలన్న డిమాండ్ ను కేసీఆర్ ఎందుకు పట్టించుకోవడంలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలతో పాటు బ్రోకర్ల కాల్ లిస్ట్ తీస్తే కేసీఆర్ ఆడిన నాటకం నాటకం బయటపడ్తదని అన్నారు. ఇన్ని రోజులు గడిచినా ఆ నలుగురిని ఎందుకు బయటకు రానిస్తలేడో సమాధానం చెప్పాలని బండి డిమాండ్ చేశారు. 

కేసీఆర్ ముందస్తుకు వెళ్లడంలేదని చెప్తే ముందస్తుకు సిద్ధమవుతున్నట్లేనని బండి సంజయ్ అన్నారు. ముఖ్యమంత్రి ఇజ్రాయెల్ టెక్నాలజీ ఉపయోగించి అందరి ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నడని ఆరోపించారు. కేసీఆర్ తాను ఇచ్చిన హామీలు ఎంత వరకు నెరవేర్చాడో ప్రజలకు ఎందుకు చెప్పడం లేదని బండి ప్రశ్నించారు.  టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ధైర్యంలేని దద్దమ్మలన్న బండి.. సమస్యలపై ప్రజలు నిలదీస్తుంటే కనీసం కేసీఆర్ కు చెప్పలేని స్థితిలో ఉన్నారని అన్నారు. బీజేపీ నేతలు టీఆర్ఎస్ లో చేరుతారంటూ సీఎం అబద్దపు ప్రచారం చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. 

మునుగోడులో బీజేపీదే నైతిక విజయమని బండి సంజయ్ అన్నారు. బీజేపీ ఓటు బ్యాంకు 12,000 నుంచి 86,000లకు పెరిగిందని చెప్పారు. ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ రంగంలోకి దిగితేనే టీఆర్ఎస్ కేవలం 10,000 ఓట్ల మెజార్టీ వచ్చిందని సటైర్ వేశారు. కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నీ కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని బండి సంజయ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ సింగిల్గా పోటీ చేస్తుందని.. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు.