ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం సిటీలోని వైఎస్సార్ నగర్ సమీపంలోని గ్రౌండ్ లో విశాక ఇండస్ట్రీస్ సహకారంతో కాకా వెంకటస్వామి మెమోరియల్ ఇంటర్ డిస్ట్రిక్ట్స్ టీ20 లీగ్ కమ్ నాకౌట్ టోర్నమెంట్ రెండు రోజులపాటు కొనసాగింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల టీమ్ లకు నిర్వహించిన మ్యాచ్ లు గురువారం రోజు ముగిసినట్లు ఖమ్మం డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ చేకూరి వెంకట్, జిల్లా కో ఆర్డినేటర్ ఎండీ మసూద్ పాషా ఇన్చార్జ్ ఫారూఖ్ తెలిపారు.
గురువారం నిర్వహించిన మూడవ మ్యాచ్ ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల మధ్య జరిగింది. తొలుత టాస్ గెలిచిన ఖమ్మం జట్టు బౌలింగ్ ఎంచుకుంది. భద్రాద్రికొత్తగూడెం జిల్లా 20 ఓవర్లలో 158 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. తర్వాత బ్యాటింగ్ చేసిన ఖమ్మం జట్టు 20 ఓవర్లలో 124 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది. భద్రాద్రికొత్తగూడెం జిల్లా 34 పరుగుల తేడాతో విజేతగా నిలిచింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచిన మహేంద్రకు జిల్లా సెక్రటరీ చేకూరి వెంకట్, జిల్లా కో ఆర్డినేటర్ ఎండీ మసూద్ పాషా రూ.2 వేల నగదు పురస్కారాన్ని అందజేశారు.
