కందనూలు, వెలుగు : సాంఘిక, గిరిజన, మైనారిటీ గురుకుల విద్యాలయాల్లో 2026–27 విద్యాసంవత్సరానికి 5 నుంచి 9వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ బాదావత్ సంతోష్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం గురుకులాల్లో నాణ్యమైన విద్యను అందిస్తుందని తెలిపారు. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం ప్రతి విద్యార్థిపై ఏడాదికి సుమారు రూ.1.70 లక్షలు ఖర్చు చేస్తుందని వివరించారు.
ఆసక్తి గల విద్యార్థులు జనవరి 21 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలోని సాంఘిక, గిరిజన, బీసీ, సాధారణ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వివరించారు.
6వ నుంచి 9వ తరగతి వరకు ఖాళీల భర్తీకి కూడా దరఖాస్తులు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఫిబ్రవరి 22న రాష్ట్రవ్యాప్తంగా రాత పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. అర్హులైన విద్యార్థులు www.tgcet.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
ఉపకార వేతనాలకు దరఖాస్తులు..
జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో చదువుతున్న షెడ్యూల్డ్ తెగల విద్యార్థులు ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. జిల్లాలో 5వ నుంచి 8వ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థులకు న్యూ స్కీమ్, 9,10వ తరగతుల గిరిజన విద్యార్థులకు రాజీవ్ విద్యాదీవెన పథకం వర్తిస్తుందని తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలని సూచించారు.
