- మ్యాపింగ్ చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది మున్సిపాలిటీల్లో సర్వే
- పైలట్ ప్రాజెక్ట్‌గా జగిత్యాలలో అమలు
- సర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ, మున్సిపల్ శాఖల సమన్వయంతో సర్వే
జగిత్యాల, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు సరిహద్దులు, యాజమాన్య హక్కులను స్పష్టంగా నిర్ధారించే నక్షా విధానాన్ని ఇప్పుడు పట్టణాలకు విస్తరించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సాగు భూములకే పరిమితమైన మ్యాపులను ఇకపై పట్టణాల్లోనూ అమలు చేయాలన్న ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 8 మున్సిపాలిటీలను ఎంపిక చేయగా, పైలట్ ప్రాజెక్టు కింద జగిత్యాల మున్సిపాలిటీకి అవకాశం లభించింది.
సర్వే ఆఫ్ ఇండియా, మున్సిపాలిటీ, భూ కొలతలు, రెవెన్యూ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం అమలు కానుంది. దీని ద్వారా పట్టణాల అభివృద్ధికి భూమికి స్పష్టమైన మ్యాప్ పునాది పడనుంది. ఈ మేరకు నాలుగు రోజుల కింద అధికారులు జగిత్యాలలో సర్వే ప్రారంభించారు.
అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా హద్దులు
ఈ విధానంలో అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా హద్దులను ఏర్పాటు చేయనున్నారు. డ్రోన్ల సాయంతో పట్టణంలోని ఇండ్లు, బిల్డింగ్‌లను క్యాప్చర్ చేసి, వాటి కొలతలు తీయనున్నారు. భూముల కబ్జాలు, డబుల్రిజిస్ట్రేషన్లు జరగకుండా నిర్ధిష్టంగా అక్షాంశ, రేఖాంశాలను గుర్తించి వాటి ఆధారంగా మ్యాపింగ్ చేయనున్నారు. ఈ మ్యాప్‌ను డిజిటల్ చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ప్రతి ఆస్తికి ప్రాపర్టీ కార్డులు జారీ చేయడం తద్వారా భవిష్యత్‌లో భూవివాదాలు రాకుండా పూర్తి స్థాయి డిజిటల్ మ్యాప్ సిద్ధం చేయనున్నారు.
డ్రోన్లతో పట్టణ మ్యాప్
జగిత్యాల జిల్లాకేంద్రంగా మారాక పట్టణం చుట్టూ సుమారు ఆరు కిలో మీటర్ల మేర విస్తరించింది. శివారు గ్రామాలు.. మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. జగిత్యాల 48 వార్డుల్లో దాదాపు 35 వేల ఇండ్లు ఉండగా.. సుమారు లక్షకు పైగా జనాభా ఉంది. ఈక్రమంలో వేగంగా విస్తరిస్తున్న పట్టణంలో భూముల కబ్జాలు, డబుల్ రిజిస్ట్రేషన్లు పెరిగాయి.
భూ వివాదాలు లేకుండా చేసేందుకు నక్షా ద్వారా సమగ్ర సర్వే చేపట్టి భూములకు పూర్తి రక్షణ కల్పించనున్నారు. వ్యక్తిగత ఆస్తులతో పాటు ప్రభుత్వ భూములు, చెరువులు, దేవాలయాల స్థలాలు సైతం స్పష్టంగా నమోదు చేయడం ద్వారా అక్రమాలకు చెక్ పెట్టే అవకాశం ఏర్పడనుంది.
