కేసీఆర్ వేల కోట్లు ఖర్చు చేసినా మునుగోడులో గెలిచేది బీజేపీనే

 కేసీఆర్ వేల కోట్లు ఖర్చు చేసినా మునుగోడులో గెలిచేది బీజేపీనే

సీఎం కేసీఆర్ వేల కోట్లు ఖర్చు చేసినా మునుగోడులో గెలిచేది బీజేపీయే అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రను బండి సంజయ్ మొదలుపెడుతున్న సందర్భంగా కుత్బుల్లాపూర్ లో ఏర్పాటుచేసిన బీజేపీ  బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ముగ్గురి కబంధ హస్తాలలో బందీ అయి రోదిస్తున్న తెలంగాణ తల్లికి విముక్తి కల్పించడానికే ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టామని సంజయ్ స్పష్టం చేశారు.

హైదరాబాద్ ను న్యూయార్క్, సింగపూర్ స్థాయిలో అభివృద్ధి చేస్తానన్న సీఎం కేసీఆర్.. అది ఎక్కడైందో చూపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. చిన్న వర్షం కురిస్తే హైదరాబాద్ మునిగిపోయే పరిస్థితి ఉందన్నారు. సిటీలో గుంత చూపిస్తే వెయ్యి ఇస్తానన్నా కేసీఆర్ కు.. సిటీలో ఉన్న గుంతలను చూపిస్తే ఇవ్వడానికి రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదన్నారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని, రైతుల రుణమాఫీ చేయాలని ప్రశ్నిస్తే బీజేపీని మతతత్వ పార్టీ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు జరపడం లేదని కేసీఆర్ ను  ప్రశ్నించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో విమోచన దినోత్సవాన్ని జరిపి తీరుతామని సంజయ్ చెప్పారు. 

రాష్ట్ర సమస్యలను గాలికి వదిలేసి కేసీఆర్ దేశాన్ని పట్టుకుని తిరుగుతున్నాడని, కేసీఆర్ బీఆర్ఎస్ కాదు.. ప్రపంచ రాష్ట్ర సమితి (పీఆర్ఎస్) పెట్టుకుని కేఏ పాల్ తో కలిసి తిరిగినా ఎలాంటి సమస్య లేదని  బండి సంజయ్ అన్నారు. తనకు 102 డిగ్రీల  జ్వరమున్నా  ప్రజా సంగ్రామ యాత్రలో పాల్లొన్నానని, కార్యకర్తలే తనకు స్ఫూర్తిప్రదాతలని చెప్పారు. కేసీఆర్ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా మునుగోడులో గెలిచేది బీజేపీయేనని సంజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు.