మోడీకి ఓటేస్తారనే.. కేంద్రం ఇచ్చిన ఇండ్లు పేదలకు ఇస్తలేరు

మోడీకి ఓటేస్తారనే.. కేంద్రం ఇచ్చిన ఇండ్లు పేదలకు ఇస్తలేరు

మహబూబ్​నగర్​/జడ్చర్ల టౌన్, వెలుగు: ‘ఇయ్యాల నారాయణపేటకు మంత్రి కేటీఆర్ వచ్చిండు. పాలమూరులో వలసలు ఏడున్నయని ప్రశ్నిస్తున్నడు. పచ్చగా ఉన్న పాలమూరులో ఏం సమస్యలు ఉన్నాయని బీజేపీ పాదయాత్ర చేస్తున్నదని అంటున్నడు. ఆయనొక డ్రామారావు” అని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని పెద్ద ఆదిరాలలో సోమవారం రాత్రి నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులను మోసం చేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నాడని విమర్శించారు. వరి వేస్తే ఉరి అని చెప్పి, ఆయన మాత్రం తన ఫామ్ హౌస్​లో వరి వేసిండని గుర్తుచేశారు. రైతులు సన్నవడ్లు వేయాలని చెప్పి, ఆయన తన 300 ఎకరాల్లో దొడ్డు వడ్లను పండించిండని చెప్పారు. అదేంటని అడిగితే, కలెక్టర్ తన పొలంలో దొడ్డు బియ్యమే పడుతుందని చెప్పాడని అంటున్నారని, మరి రైతుల భూముల్లో ఎందుకు మట్టి పరీక్షలు చేయిస్తలేరని ప్రశ్నించారు. కేసీఆర్ భూముల్లో పంటలు పండి, ఆయన కోటీశ్వరుడు కావాలని, పేద రైతులు మాత్రం పంటలు ఎండిపోయి బికారి గాళ్లు కావాలనేదే కేసీఆర్ టార్గెట్ అని ఆరోపించారు. 

కృష్ణా జలాల్లో అన్యాయం చేసిండు

ఏపీ మాజీ సీఎం చంద్రబాబుతో ఒప్పందం చేసుకొని, తెలంగాణకు కృష్ణా జలాల వాటాలో అన్యాయం చేసిండని సంజయ్ మండిపడ్డారు. తెలంగాణకు కేంద్రం 1.40 లక్షల ఇండ్లు ఇస్తే, వాటిని ఎందుకు పంపిణీ చేయడం లేదన్నారు. దీనిపై ప్రశ్నిస్తే సీఎం సమాధానం చెప్పడం లేదన్నారు. పేదలకు ఇండ్లు ఇవ్వొద్దని, ఇస్తే మోడీకి ఓటు వేస్తారనే ఉద్దేశంతోనే పెండింగ్​లో పెట్టారని విమర్శించారు. ఆయన మాత్రం రూ.800 కోట్లతో వంద రూములతో ప్రగతిభవన్​ను కట్టుకున్నాడని విమర్శించారు. తెలంగాణలో అమలవుతున్న స్కీంలకు అన్నింటికీ కేంద్రం నిధులిస్తోందని చెప్పారు. కేసీఆర్ మాత్రం తానే ఇచ్చినట్లుగా ప్రకటించుకుంటున్నాడని విమర్శించారు. భృతి పేద్ద ఆదిరాల ప్రజలు టీఆర్​ఎస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను గ్రహించాలన్నారు. 

అమిత్​షా సభతో చరిత్ర సృష్టిద్దాం

హైదరాబాద్, వెలుగు: ప్రజా సంగ్రామ యాత్ర- ముగింపు సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య​అతిథిగా హాజరవుతున్నందున గ్రాండ్ సక్సెస్ చేసి సరికొత్త చరిత్ర సృష్టిద్దామని పార్టీ నేతలకు సంజయ్ పిలుపునిచ్చారు. ఈ నెల14న రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వద్ద నిర్వహించనున్న సభ ఏర్పాట్లపై గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ కార్పొరేటర్లు, ఇతర పార్టీ నేతలతో ఆయన సోమవారం జడ్చర్ల మండలం మక్తపల్లి గేట్ వద్ద లంచ్ శిబిరంలో సమావేశమయ్యారు. టీఆర్ఎస్ పాలన పట్ల ప్రజలు విసిగిపోయారని, మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పుకు సంకేతంగా పాదయాత్ర ముగింపు సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేయాలని పిలుపునిచ్చారు. సభ ఏర్పాట్లు, వివిధ అంశాలపై కార్పొరేటర్లు, పార్టీ సీనియర్ నేతల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు.