- సీట్ల పెంపుతో దక్షిణాదికి నష్టమని చెప్పడం సరికాదు: బండి సంజయ్
- తమిళనాడు, కేరళలో ఓడిపోతామనే భయం రేవంత్‌లో ఉందని కామెంట్
హైదరాబాద్, వెలుగు: మహిళలకు చట్టసభల్లో 33 శాతం సీట్లు కేటాయిస్తే కాంగ్రెస్‌కు వచ్చిన ఇబ్బంది ఏమిటో చెప్పాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనపై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఎందుకీ వివక్ష వ్యాఖ్యలు అంటూ బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు. అసెంబ్లీ, పార్లమెంట్ సీట్ల సంఖ్య పెంపుతో దక్షిణాదికి జరిగే నష్టమేంటని ఆయన ప్రశ్నించారు. ‘‘తెలంగాణలో 50 శాతం సీట్లను పెంచొద్దని మీరు చెబుతున్నారా? ఇంకెన్నాళ్లు ప్రాంతీయ అసమానతల పేరు చెప్పి చలి కాచుకుంటారు? రేవంత్ రెడ్డిలో దేశ భక్తి, జాతీయ వాదం మచ్చుకైనా కన్పించడం లేదు. తమిళనాడు, కేరళలో కాంగ్రెస్ కూటమి ఓడిపోతుందనే వణుకు రేవంత్ లో మొదలైంది.
ఎన్ని జిమ్మిక్కులు చేసినా కాంగ్రెస్ పాచికలు అక్కడ పారడం లేదని అర్థమైంది. అందుకే దక్షిణాదికి అన్యాయం జరుగుతోందంటూ కొత్త డ్రామా మొదలుపెట్టారు. పార్లమెంట్, అసెంబ్లీలో 33 శాతం మంది మహిళలకు ప్రాతినిధ్యం కల్పిస్తే తప్పేంటి. కాంగ్రెస్ పార్టీకి మహిళలంటేనే ద్వేషం.. అందుకే 50 ఏండ్ల పాలనలో వారికి రిజర్వేషన్లు ఇవ్వలేదు. మహిళా రిజర్వేషన్ల బిల్లు కాపీలను చింపివేసిన ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీలతో కాంగ్రెస్ అంటకాగుతోంది. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా ప్రధాని మోదీ నాయకత్వంలో మహిళా రిజర్వేషన్లు అమలు చేసి తీరుతాం” అని బండి సంజయ్ స్పష్టం చేశారు.
పెట్రోలు, డీజిల్ కొరత లేదు..
రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న వదంతులు నమ్మొద్దని ప్రజలకు బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. ఆయిల్ సంస్థల వద్ద సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయనే విషయాన్ని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. పెట్రోలు, డీజిల్ కొరత రాకుండా కేంద్రం ఎప్పటికప్పుడు ఆయిల్ నిల్వలపై పర్యవేక్షిస్తోందని తెలిపారు. వాహనదారులు రోజువారీ అవసరాలకు తగ్గట్లుగానే పెట్రోలు, డీజిల్‌ను కొనుగోలు చేయాలని సూచించారు.
అమెరికా– ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా పెట్రోలు, డీజిల్ కొరత ఏర్పడిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. వదంతులు నమ్మి చాలా మంది పెట్రోలు బంకుల వద్దకు పరుగులు తీస్తూ అవసరానికి మించి కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. దీంతో పెట్రోలు బంకుల్లో స్టాక్ కొరత ఏర్పడుతోందని చెప్పారు. ఇదే అదనుగా కొంతమంది కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ దందాకు పాల్పడే ప్రమాదం ఉందన్నారు.
