కాంగ్రెస్ ఏడాది పాలనలో..1,500 స్కూళ్లు క్లోజ్: కేంద్ర మంత్రి బండి సంజయ్

కాంగ్రెస్ ఏడాది పాలనలో..1,500 స్కూళ్లు క్లోజ్: కేంద్ర మంత్రి బండి సంజయ్
  • బీఆర్ఎస్ హయాంలో ఆరు వేల బడులు మూసేశారు
  • ఫీజు రీయింబర్స్​మెంట్​ ఇవ్వక కాలేజీలు ఆగమైతున్నయ్  
  • భయపడి మేనేజ్​మెంట్లు రాజీ పడినా.. మేం ఊరుకోం 
  • స్టూడెంట్ భరోసా కార్డు మరిచిన కాంగ్రెస్ సర్కార్
  • ఏబీవీపీ రాష్ట్ర మహాసభల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్

హైదరాబాద్, వెలుగు: పదేండ్ల బీఆర్ఎస్ పాలనతోపాటు రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా ఆగమైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ హయాంలో ఆరు వేల స్కూళ్లు మూసివేశారని, వాటిని తెరిపిస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కారు.. అధికారంలోకి వచ్చాక ఉన్నవాటిని కూడా మూసివేస్తున్నదన్నారు.

 కేవలం ఏడాది కాలంలోనే రాష్ట్రంలో 1,500 సర్కారు బడులను కాంగ్రెస్ ప్రభుత్వం మూసేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీచర్లు, మౌలిక వసతులు లేక ఏకంగా 2,081 ప్రభుత్వ బడుల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదన్నారు.


శంషాబాద్‌‌‌‌లో జరుగుతున్న ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభలకు బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సామాజిక సేవకుడు భీమనపల్లి శ్రీకాంత్‌‌‌‌కు ‘జనమంచి గౌరీశంకర్ జీ యువ పురస్కార్’ అందజేశారు. అనంతరం మహాసభలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గత నాలుగేండ్లుగా ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్ బకాయిలు దాదాపు రూ.10 వేల కోట్లు పేరుకుపోయాయని, సర్కారు తీరుతో మూడేండ్లలో వందలాది కాలేజీలు మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.

 ‘‘ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్ కోసం కాలేజీ యాజమాన్యాలు నా దగ్గరికి వస్తే మద్దతిస్తానని చెప్పిన. కానీ వాళ్లు సర్కారుకు భయపడి కాంప్రమైజ్ అవుతున్నరు. యాజమాన్యాలు తగ్గినా.. విద్యార్థులను ఇబ్బంది పెడితే మాత్రం మేం చూస్తూ ఊరుకోం’’ అని హెచ్చరించారు. ప్రతి విద్యార్థికి రూ.5 లక్షల భరోసా కార్డు ఇస్తామని చెప్పి, కనీసం పోస్ట్ కార్డు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. 

హాస్టల్ స్టూడెంట్లకు కనీసం కడుపు నిండా తిండి పెట్టక ఫుడ్ పాయిజన్‌‌‌‌తో చంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం ఏడాది వ్యవధిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారని, కానీ అది నెరవేర్చలేదన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారని, అది ఏమైందని ప్రశ్నించారు. 

బుల్లెట్‌‌‌‌ నమ్ముకున్నోళ్లు మట్టికొట్టుకుపోయారు

నక్సలైట్లు, టెర్రరిస్టులు నల్లజెండాలు ఎగరేస్తే.. జాతీయ జెండా కోసం త్యాగాలు చేసిన చరిత్ర ఏబీవీపీదేనని సంజయ్ అన్నారు. బుల్లెట్‌‌‌‌ను నమ్ముకున్నోళ్లు మట్టికొట్టుకుపోయారని, బ్యాలెట్‌‌‌‌ను నమ్ముకున్నోళ్లు ఉన్నతంగా ఎదిగారని చెప్పారు. ప్రధాని మోదీ, అమిత్ షా నేతృత్వంలో 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజం పూర్తిగా అంతం కాబోతున్నదన్నారు. 

కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు రావుల కృష్ణ, కార్యదర్శి రాంబాబు, కార్యదర్శి రాంబాబు, కర్నె రామచందర్, గీతాసింగ్, భీమనపల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.