ముందు రాష్ట్రంలో  అందరికి ఫ్రీ కరెంట్ ఇయ్యి

ముందు రాష్ట్రంలో  అందరికి ఫ్రీ కరెంట్ ఇయ్యి

హైదరాబాద్: దేశ ప్రజలందరికీ ఫ్రీ కరెంట్ ఇస్తానని చెప్తోన్న కేసీఆర్... ముందు రాష్ట్రంలో  అందరికి ఫ్రీ కరెంట్ ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. జాతీయ రాజకీయాల పేరుతో పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న కేసీఆర్ ను అక్కడి నాయకులెవరూ పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర సమస్యలను గాలికొదిలేసి పర్యటనల పేరుతో  ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు. నలుగురు మహిళలు చనిపోయిన ఇబ్రహీంపట్నం ఘటన నుంచి దృష్టి మళ్లించడానికి కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. ఒక గంటలో 34 కు.ని ఆపరేషన్లు చేయాల్సిన అవసరమేమొచ్చిందని నిలదీశారు. కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించలేని పరిస్థితుల్లో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ఉన్నారని ఫైర్ అయ్యారు. దేశంలో ఎక్కడా కూడా ఇంత దారుణం జరగలేదని, మృతుల పిల్లలను చూస్తే బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కు.ని. ఆపరేషన్ల కోసం కనీసం మహిళా డాక్టర్లను పెట్టాలనే కామన్ సెన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని విమర్శించారు. ఇంత జరుగుతంటే రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 

హెల్త్ డైరెక్టర్ మీద వచ్చినన్ని ఆరోపణలు ఎవరిమీద రాలేదని, అయితే సీఎంవో అధికారులకు నెలనెలా ముడుపులు అప్పజెప్పి తన పదవిని కాపాడుకుంటున్నారని బండి సంజయ్ ఆరోపించారు.  ఇబ్రహీంపట్నం ఘటనలో చివరికి అమాయకుడైన శ్రీధర్ అనే డాక్టర్ ను సస్పెండ్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు. దీనికి బాధ్యత వహిస్తూ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావును వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే హెల్త్ డైరెక్టర్ ను సస్పెండ్ చేయాలన్నారు. గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు మామూలు అయిపోయాని ఆరోపించారు. అనేక సమస్యలతో విద్యార్థులు బాధపడుతోంటే... ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. పేదోళ్లకు చదువు లేకుండా చేస్తున్నారని సీఎం కేసీఆర్ పై  ఫైర్ అయ్యారు. కేసీఆర్ కాయిల్ తప్పిండని ఆయన సన్నిహితులే చెబుతున్నారని, కొడుకు, కూతరు అవినీతిని చూసి కేసీఆర్ షాక్ అవుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలను డైవర్ట్ చేసేందుకు కేసీఆర్ పబ్లిక్ మీటింగ్ లు పెడుతున్నారని చెప్పారు.