అస్సాం సీఎంను గౌరవించాల్సింది పోయి, నీచంగా వ్యవహరించారు

అస్సాం సీఎంను గౌరవించాల్సింది పోయి, నీచంగా వ్యవహరించారు

హైదరాబాద్‌‌, వెలుగు: అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మపై దాడికి యత్నించిన టీఆర్ఎస్ నేతపై హత్యాయత్నం కేసు పెట్టి, అరెస్టు చేయాలని బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్ డిమాండ్ చేశారు. ఈ దాడికి రెచ్చగొట్టిన మంత్రులపైనా కేసు నమోదు చేయాలన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. గణేశ్ నిమజ్జనానికి ముఖ్య అతిథిగా వచ్చిన అస్సాం సీఎంను గౌరవించాల్సింది పోయి, టీఆర్ఎస్ నేతలు నీచంగా వ్యవహరించారని మండిపడ్డారు.

టీఆర్ఎస్ గూండాలను పంపించి దాడికి ప్రయత్నించడం కేసీఆర్ దిగజారుడుతనానికి నిదర్శనమని ఫైర్ అయ్యారు. అసలు టీఆర్ఎస్ నేతను పోలీసులు స్టేజీ పైకి ఎలా రానిచ్చారని.. వేరే రాష్ట్ర సీఎం వస్తే ఇచ్చే భద్రత ఇదేనా? అని ప్రశ్నించారు. గణేష్ శోభాయాత్రలో కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులెవరూ పాల్గొనలేదని.. కానీ అస్సాం సీఎం వస్తేనేమో అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల పండుగలకు అడ్డంకులు సృష్టించేందుకు కేసీఆర్ చేస్తున్న కుట్రలను ప్రజలు తిప్పికొట్టారని, శోభాయాత్రలో లక్షలాది మంది పాల్గొని చెంపచెళ్లుమనిపించారని అన్నారు.  

రాష్ట్రంలో అరాచక వ్యవస్థ: విజయశాంతి 

దాడి ఘటనను చూస్తుంటే రాష్ట్రంలో ఎంత అరాచక వ్యవస్థ నడుస్తోందో అర్థమవుతోందని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. టీఆర్ఎస్ నేత స్టేజీ పైకి వచ్చి మైక్ లాక్కున్నా పోలీసులు రాలేదని, ఇదంతా చూస్తుంటే ఉద్దేశపూర్వకంగా జరిగినట్లు తెలుస్తోందన్నారు. దాడికి యత్నించిన టీఆర్ఎస్ నేతపై కేసు పెట్టి, అరెస్టు చేయాలని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్‌‌రెడ్డి డిమాండ్ చేశారు.