తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్​ది దొంగ దీక్ష

  తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్​ది దొంగ దీక్ష
  • కేసీఆర్​ది దొంగ దీక్ష
  • దళిత సీఎం అని చెప్పి, మాట తప్పిండు: సంజయ్ 
  • ఆయనకు ఎన్నికలప్పుడే భైంసా గుర్తొచ్చిందా? 
  • భైంసాను మహిషాగా మారుస్తామని హామీ

భైంసా/కరీంనగర్, వెలుగు: తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ దొంగ దీక్ష చేశారని.. దళితుడిని సీఎం చేస్తానని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్​విమర్శించారు. శనివారం నిర్మల్ ​జిల్లా ముథోల్ నియోజకవర్గంలోని భైంసాలో జరిగిన బహిరంగ సభలో, కరీంనగర్ లో నిర్వహించిన ప్రచారంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్​కు ఎన్నికలప్పుడే భైంసా గుర్తుకొచ్చిందా? ఆయన ఇన్ని రోజులు ఏం చేశారని మండిపడ్డారు. రోజంతా ప్రధాని మోదీని, బీజేపీని తిట్టడమే కేసీఆర్ పనిగా పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. 

‘‘హైదరాబాద్ లోని పాతబస్తీని అభివృద్ధి చేస్తామంటే, అక్కడున్నోళ్లందరూ సంతోషిస్తున్నారు. కానీ ఎంఐఎం వాళ్లే వ్యతిరేకిస్తున్నారు. ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం కాదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మోసాలను ప్రజలు గుర్తించాలి” అని అన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలేమో గానీ.. ముందుగా ఆ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్​లోకి వెళ్లరని గ్యారంటీ ఇవ్వాలని సవాల్ విసిరారు. ముథోల్ లో బీజేపీని గెలిపిస్తే నాందేడ్ నుంచి నిర్మల్ మీదుగా మంచిర్యాల వరకు రైలు మార్గం వేయిస్తామని, భైంసాను మహిషాగా మారుస్తామని హామీ ఇచ్చారు. ముథోల్​ను దత్తత తీసుకుంటానని ప్రకటించారు. 

బీఆర్ఎస్, కాంగ్రెస్ ను నమ్మొద్దు.. 

భైంసాలో ఎంఐఎం గూండాలు అరాచకాలకు పాల్పడ్డారని సంజయ్ అన్నారు. ‘‘ఓట్ల కోసం ఎంఐఎంను బీఆర్ఎస్ నమ్ముకుంటే, మత పెద్దలను కాంగ్రెస్ నమ్ముకుంది. ముస్లిం సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్న.. వాళ్లు ఓట్ల కోసమే మీ వద్దకు వస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. మోదీ ప్రభుత్వం వచ్చాక దేశంలో ఎక్కడా అల్లర్లు జరగలేదు. ఎక్కడా మతకలహాలు జరగలేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మాటలు నమ్మితే మోసపోతారు” అని అన్నారు. పత్తి బాగా పండే ముథోల్ నియోజకవర్గంలో టెక్స్ టైల్ పార్క్, పీజీ కాలేజీ, ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు.