
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ వెనుక పెద్ద కుట్ర దాగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షలకు సంబంధించి ప్రశ్నాపత్రాలన్నీ లీక్ అయ్యాయని ఆయన ఆరోపించారు. గతేడాది నిర్వహించిన గ్రూప్-1 పరీక్షా పత్రం సైతం లీక్ అయ్యిందని చెప్పారు. టీఎస్పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్ ఈ ప్రశ్నాపత్రాన్ని లీక్ చేయడంతోపాటు తానే స్వయంగా పరీక్ష రాశారని సంజయ్ తెలిపారు. అత్యధికంగా ప్రవీణ్ కు 103 మార్కులొచ్చాయని, అందుకు సంబంధించిన ఓఎంఆర్ షీట్ ను బండి సంజయ్ ప్రస్తావించారు. ప్రవీణ్ కోసం పరీక్షా సమయాన్ని సైతం మార్చారని, అభ్యర్థులందరికీ ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పరీక్ష నిర్వహిస్తే... ప్రవీణ్ పరీక్ష రాసే కాలేజీకి మాత్రం మధ్యాహ్నం తరువాత నిర్వహించారని సంజయ్ తెలిపారు. దీనిపై ఓ పత్రికలో వార్త వచ్చేంతవరకు టీఎస్పీఎస్సీ స్పందించలేదని చెప్పారు. రాబోయే రెండు నెలల్లో జరగబోయే పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలకు సంబంధించిన సమాచారం కూడా కేసీఆర్ టీం వద్ద ఉందనే సమాచారం తమవద్ద ఉందన్నారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు సంజయ్. తక్షణమే సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణకు ఆదేశించడంతోపాటు ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఛైర్మన్ కు తెలియకుండా పేపర్ లీక్ కావడం అసాధ్యం
నిబంధనల ప్రకారం.... టీఎస్పీఎస్సీలో కాన్ఫిడెన్షియల్ డిపార్ట్ మెంట్ ఛైర్మన్ పరిధిలో మాత్రమే ఉంటుందని, ఛైర్మన్ కు తెలియకుండా పేపర్ లీక్ కావడం అసాధ్యమని సంజయ్ అన్నారు. క్వశ్చన్ పేపర్ ఏ ఒక్క ఉద్యోగి కంప్యూటర్లో ఉండటానికి వీల్లేదు. అట్లాంటిది ఒక సెక్షన్ ఆఫీసర్ కంప్యూటర్లో ప్రశ్నాపత్రాలు ఎట్లా ప్రత్యక్షమవుతాయి? వాటిని ప్రవీణ్, రాజశేఖర్ ఎట్లా పెన్ డ్రైవ్ లోకి తీసుకుంటారు? టీఎస్పీఎస్సీ ఛైర్మన్, కార్యదర్శి ప్రమేయం లేకుండా ఇది అసాధ్యం? అని సంజయ్ ప్రశ్ని్ంచారు. తెలంగాణలోని లక్షలాది నిరుద్యోగుల జీవితాలతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని కేసీఆర్ ప్రభుత్వం తేలికగా కొట్టిపడేసేందుకు యత్నిస్తోందని సంజయ్ ఆరోపించారు.
ఉద్యోగాలను భర్తీ చేయడం కేసీఆర్ కు ఏ మాత్రం ఇష్టం లేదు
వాస్తవానికి తెలంగాణలో ఉద్యోగాలను భర్తీ చేయడం సీఎం కేసీఆర్ కు ఏ మాత్రం ఇష్టం లేదన్నారు సంజయ్. రాష్ట్రాన్ని ఆర్దికంగా పూర్తిగా దివాళా తీయించిన కేసీఆర్ కొత్త ఉద్యోగాలను భర్తీ చేయలేని స్థితిలో ఉన్నారని చెప్పారు. లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని అసెంబ్లీలో ఇచ్చిన హామీని అమలు చేయడం అసాధ్యమని తెలిసి... నోటిఫికేషన్లు, ప్రశ్నాపత్రాల లీకేజీ పేరుతో కాలయాపన చేస్తూ నిరుద్యోగుల నోట్లో మట్టి కొడుతున్నారు. అందులో భాగంగానే గ్రూప్-1సహా ఇతర పరీక్షా పత్రాలన్నీ లీకేజీ చేస్తున్నట్లు అర్ధమవుతోందన్నారు.