రాష్ట్ర సర్కార్ తీరుపై బండి సంజయ్ ఫైర్

రాష్ట్ర సర్కార్ తీరుపై బండి సంజయ్ ఫైర్

హైదరాబాద్, వెలుగు: సమ్మేళనాలు.. ఉత్సవాలు.. వేడుకల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాలు తీస్తున్నదనంటూ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం మర్పెల్లిగూడెంలో ఆరో తరగతి స్టూడెంట్ ధనుశ్ ట్రాక్టర్ కింద పడి చనిపోవడంపై సంజయ్ ఘాటుగా స్పందించారు. ప్రజల ఉసురు పోసుకునేందుకే బీఆర్ఎస్ సర్కార్ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తోందా? అంటూ ట్విట్టర్​లో ఫైర్ అయ్యారు. బాధిత కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. ‘‘స్కూల్లో చదువుకుంటున్న స్టూడెంట్​ను దశాబ్ది ఉత్సవాలకు తీసుకొచ్చిన ప్రభుత్వమే ఈ మృతికి బాధ్యత వహించాలి. బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాలి.

దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేలా ప్రభుత్వ యంత్రాంగంపై సర్కార్ ఒత్తిడి తెస్తున్నది. స్టూడెంట్స్​ను కూడా బలవంతం చేస్తున్నది”అని సంజయ్ మండిపడ్డారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న చిన్నారి చనిపోవడానికి కారణం ఎవరని నిలదీశారు. ఆ తల్లిదండ్రులకు కడుపు కోత ఎవరు తీరుస్తారంటూ ప్రశ్నించారు. ఏం చెప్పి ఓదారుస్తారని మండిపడ్డారు. ‘‘గతంలో ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అగ్ని ప్రమాదం జరిగింది. అప్పుడు కూడా కొందరు చనిపోయారు. వనపర్తి జిల్లాలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కళ్యాణ లక్ష్మి చెక్కు తీసుకునేందుకు వచ్చిన వృద్ధురాలిని రోజంతా వెయింట్ చేయించి ఆమె మృతికి కారణమయ్యారు. ఇప్పుడు దశాబ్ది ఉత్సవాల్లో ఆరో తరగతి చిన్నారి చనిపోయాడు”అంటూ సంజయ్ ట్విట్టర్‌‌‌‌‌‌‌‌లో మండిపడ్డారు.

మోదీ, షా టూర్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ ఫోకస్

రాష్ట్రంలో బీజేపీ అగ్ర నేతల టూర్‌‌‌‌‌‌‌‌ను ఖరారు చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీ వెళ్లారు. తెలంగాణలో చేపట్టాల్సిన సభలపై మంగళవారం రాత్రి వరకు జాతీయ నేతలతో చర్చించినట్లు తెలిసింది. మోదీ తొమ్మిదేండ్ల పాలన పూర్తయిన సందర్భంగా మహా జన సంపర్క్ అభియాన్ ప్రోగ్రామ్‌‌‌‌లో భాగంగా.. రాష్ట్రంలో ముగ్గురు అగ్ర నేతలతో బహిరంగ సభలు నిర్వహించాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 15న ఖమ్మంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభ నిర్వహించాల్సి ఉంది. కానీ గుజరాత్‌‌‌‌లో తుఫాన్ రావడంతో వాయిదా పడింది. ఈ నెల 25న నాగర్ కర్నూల్‌‌‌‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సభ ఉంది.

మరోవైపు ఈ నెల 30 లోపు మహా జన సంపర్క్‌‌‌‌ అభియాన్ ముగియనుంది. ఈలోపు మరో రెండు బహిరంగ సభలు నిర్వహించడం తప్పనిసరిగా మారింది. దీంతో ఏ తేదీల్లో నిర్వహించాలనే దానిపై ఢిల్లీకి వెళ్లి సంజయ్ సంప్రదింపులు జరిపారు. ఒకటి పీఎం మోదీది కాగా.. రెండోది అమిత్ షా ప్రోగ్రాం. ఈ రెండు సభల తేదీలు ఒకటి, రెండు రోజుల్లో ఖరారు అయ్యే అవకాశం ఉన్నట్లు మాచారం. డేట్ల ఖరారుపై చర్చించిన తర్వాత సంజయ్ మంగళవారం రాత్రి తిరిగి హైదరాబాద్ బయల్దేరారు.