బూతుల వర్సిటీకి వైస్ ఛాన్సలర్ కేసీఆర్ 

బూతుల వర్సిటీకి వైస్ ఛాన్సలర్ కేసీఆర్ 

రాజ్యాంగాన్ని తిరిగి రాయాలన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ వ్యాఖ్యలపై ఢిల్లీ తెలంగాణ భవన్ లో నిరసన వ్యక్తం చేసిన నేతలు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. రాజ్యాంగం జోలికొస్తే చూరచూర చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. సీఎం వ్యాఖ్యలు బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగొద్దనేలా ఉన్నాయని విమర్శించారు. కేసీఆర్ వ్యాఖ్యలతో బడుగు బలహీనవర్గాలపై కేసీఆర్కున్న ద్వేషం బయటపడిందని అన్నారు. ఆ కారణంగానే సీఎం కేసీఆర్ అంబేద్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు హాజరుకారని బండి సంజయ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి 125 అడుగుల బాబా సాహెబ్ విగ్రహాన్ని ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. 

రాష్ట్రపతి దళితుడైనందునే టీఆర్ఎస్ ఆయన ప్రసంగాన్ని బహిష్కరించిందని బండి సంజయ్ ఆరోపించారు. రాజ్యాంగం తిరిగి రాయాలన్న వ్యక్తి తెలంగాణ సీఎంగా ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. కేసీఆర్ను గద్దె దించేందుకు అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ బూతుల యూనివర్సిటీకి వైస్ ఛాన్స్లర్ అన్న బండి సంజయ్.. ఆయనంత అవినీతిపరుడు ఎవరూ ఉండరని అన్నారు. ఈఎస్ఐ స్కాంలో ఆయన పాత్ర ఉందని ఆరోపించారు. కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నాయకులు రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేయనున్నట్లు బండి సంజయ్ ప్రకటించారు. తదుపరి కార్యాచరణను గురువారం ప్రకటిస్తామని చెప్పారు.