పేదలను బస్సుల్లో కూడా తిరగనివ్వరా

పేదలను బస్సుల్లో కూడా తిరగనివ్వరా

ఆర్టీసీ ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకోవడానికి కూడా వెళ్లనివ్వరా అని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఆర్టీసీ బస్సు చార్జీల పెంపును నిరసిస్తూ జేబీఎస్ బస్ స్టాండ్ వద్ద ఆందోళనకు ఆయన పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్టీసీ చార్జీలు పెంచడం మూర్ఖత్వం కాదా అని సంజయ్ అన్నారు. టీఆర్ఎస్ సర్కారు మూడేళ్లలో ఐదుసార్లు చార్జీలు పెంచిందని..పేదలను బస్సుల్లో కూడా తిరగనివ్వరా..? నడుచుకుంటూ తిరగాలా..? అని నిలదీశారు. టీఆర్ఎస్ సర్కారు వచ్చినప్పటి నుంచి 60 శాతం ఛార్జీలను పెంచిందని చెప్పారు.

కేసీఆర్ పేదల ఉసురుపోసుకోక తప్పదని బండి సంజయ్ మండిపడ్డారు. మేం ఆందోళన కార్యక్రమాలు చేసేందుకు వెళ్లట్లేదని..ఇండ్లు ముట్టడించాల్సిన అవసరం పోలీసులకు ఎందుకొచ్చిందని అడిగారు. రేపిస్టులను అరెస్టులు చేయడం చేతకాదు కాని, బీజెపీ నాయకుల ఇళ్లను ముట్టడించడం ఏంటని ప్రశ్నించారు. రాజకీయ పార్టీలు ఇళ్లు ముట్టడించడం చూశాం.. కానీ  పోలీసులే ఇలా ఇళ్లను ముట్టడించడం టీఆర్ఎస్ హయాంలోనే చూస్తున్నామన్నారు. ఇదే పోలీసు ఫోర్స్ రేపిస్టులను, క్రిమినల్స్ ను కట్టడి చేస్తే బాగుంటుందని...అప్పుడు శాంతి భద్రతల సమస్య ఉండదన్నారు. నిర్భంధాలు, అరెస్టులు, కేసులతో తమ ఉద్యమాన్ని ఆపలేరని బండి సంజయ్ స్పష్టం చేశారు.