
ప్రజా సంగ్రామ యాత్ర 2 ముగింపు సభతో సరికొత్త చరిత్ర సృష్టిద్దామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ సమీపంలో ఈ నెల 14న నిర్వహించే ముగింపు సభను కనీవినీ ఎరగని రీతిలో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ సభకు హాజరుకానున్నట్లు సంజయ్ ప్రకటించారు. టీఆర్ఎస్ పాలన పట్ల రాష్ట్ర ప్రజలు విసిగిపోయి మార్పు కోరుకుంటున్నారని, దానికి సంకేతంగా పాదయాత్ర ముగింపు సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేయాలని అన్నారు. పాలమూరు జిల్లాలో పాదయాత్రకు విశేష స్పందన లభిస్తోందని, జనం తండోపతండాలుగా తరలివచ్చి సమస్యలు చెప్పుకుంటున్నారని చెప్పారు. పాలమూరు ఎడారిగా మారిందని, ప్రజలకు నిలువ నీడ లేకుండా పోయిందని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ముగింపు సభకు ఒక్కో డివిజన్ నుంచి వేలాది మంది ప్రజలు హాజరయ్యేలా చూడాలని కార్పొరేటర్లు, సీనియర్ నేతలకు బండి సంజయ్ సూచించారు. అందుకు అనుగుణంగా రవాణా, ఇతర ఏర్పాట్లు చేయాలని చెప్పారు. సమావేశంలో పాల్గొన్న కార్పొరేటర్లు, బీజేపీ నేతలు సభను సక్సెస్ చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని సంజయ్కు హామీ ఇచ్చారు