సీఐటీడీ ఎక్స్టెన్షన్ సెంటర్ను ప్రారభించండి: బండి సంజయ్ 

సీఐటీడీ ఎక్స్టెన్షన్ సెంటర్ను ప్రారభించండి: బండి సంజయ్ 

కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ) ఎక్స్ టెన్షన్ సెంటర్ ను వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కేంద్ర సూక్ష్మ, చిన్న,మధ్యతరహా మంత్రిత్వ శాఖ (MSME) ఉన్నతాధికారులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కోరారు. సీఐటీడీ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డైరెక్టర్ జె. బ్రహ్మేశ్వరయ్య సహా పలువురు ఉన్నతాధికారులతో హైదరాబాద్ లో  బండి సంజయ్ కుమార్ సమావేశమయ్యారు. సీఐటీడీ ఎక్స్ టెన్షన్ సెంటర్ ఏర్పాటు పనుల పురోగతి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం రూ.19.86 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపడుతుండగా, ఇప్పటికీ రూ.6 కోట్లు కేంద్ర నిధులు మంజూరు చేసిందన్నారు. 

అయితే సీఐటీడీ ఎక్స్ టెన్షన్ కేంద్రం కోసం రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఒక ఎకరా స్థలంతోపాటు 50 వేల చదరపు అడుగుల భవనాన్ని నిర్మించి, తగిన సదుపాయాలు కేటాయించాల్సి ఉంది. ఈ విషయంలో  ప్రభుత్వం తరపున చేపడుతున్న కార్యక్రమాలపై శ్రీ బండి సంజయ్ ఆరా తీశారు. ఈ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ ను కోరారు. దీని ద్వారా ఉత్తర తెలంగాణకు చెందిన ఏటా వేలాది మంది యువతకు ముఖ్యంగా ఐటీఐ, డిప్లొమా, ఇంజనీరింగ్ వంటి సాంకేతిక విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు స్కిల్ డెవలెప్ మెంట్ శిక్షణ అందించడం ద్వారా పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతుందన్నారు. సీఐటీడీ ఎక్స్ టెన్షన్ సెంటర్ ఏర్పాటు ద్వారా స్థానికంగా ఉన్న పరిశ్రమలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.