రైతులపై ప్రభుత్వం మొసలి కన్నీరు: బండి సంజయ్

రైతులపై ప్రభుత్వం మొసలి కన్నీరు: బండి సంజయ్
  • రూ. 161 కోట్ల ఉపాధి నిధులు దారి మళ్లించి కేంద్రాన్ని బద్నాం చేస్తరా?

హైదరాబాద్, వెలుగు: జాతీయ ఉపాధి హామీ పథకానికి కేంద్రం ఇచ్చిన రూ.161 కోట్ల నిధులను కేసీఆర్ ప్రభుత్వం దారి మళ్లించి అవినీతికి పాల్పడిందని, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ధర్నాలకు దిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రైతులపై మొసలి కన్నీరు ఒలకపోస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం...గతంలో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదు? రైతులకు రుణ మాఫీ ఏమైంది? ఉచితంగా ఎరువులు అందిస్తామన్న హామీ ఎటుపోయింది? కౌలు రైతుకు రైతు బంధు ఎందుకు ఇవ్వడం లేదు?” అని ఆయన నిలదీశారు. ఏటా వేలాది మంది రైతులు అకాల వర్షాలతో పంట నష్టపోతుంటే వారికి ఇంతవరకు నష్ట పరిహారం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.  కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయకుండా తెలంగాణ రైతాంగానికి నష్టం చేస్తున్నది కేసీఆర్​ సర్కార్​ కాదా? అని శుక్రవారం ఒక ప్రకటనలో సంజయ్​ మండిపడ్డారు. ‘‘ఉపాధి పథకం కింద వేతనాల్లో భాగంగా విడుదలైన రూ.161 కోట్ల నిధులను కేసీఆర్ ప్రభుత్వం దారి మళ్లించింది. ఇందులో అవినీతి జరిగిందని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆ నిధులను వెంటనే వాపస్ చేయాలని కోరింది.. ఇది వాస్తవం. అయితే బీఆర్ఎస్ సర్కార్ తమ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి మహా ధర్నా పేరుతో రాష్ట్రంలో ఆందోళనలకు దిగి తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నది” అని అన్నారు.  బీఆర్ఎస్ నాయకులకు, రాష్ట్ర మంత్రులకు, ఆ పార్టీ ఎమ్మెల్యేలకు జాతీయ ఉపాధి హామీ చట్టంపై ఏమాత్రం అవగాహన లేదని, కనీసం ఆ చట్టంలో ఏముందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదని దుయ్యబట్టారు. వ్యవసాయ అనుబంధ రంగాలు ఉపాధి చట్టం పరిధిలోకి రానేరావని తెలిపారు.  ‘‘నీటిపారుదల కార్యకలాపాలు, నీరు, భూమి అభివృద్ధి పనులు, చిన్న నీటిపారుదల పనులు మాత్రమే చట్టంలోని షెడ్యూల్ 4(3)లో భాగంగా ఉన్నాయి. 2005 లో ఈ మేరకు చట్టం చేశారు. 17 ఏండ్ల తర్వాత ఆ చట్టంలో లేని అంశాలపై బీఆర్​ఎస్​ ధర్నాలు చేస్తూ.. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టాలని చూడడం దిగజారుడుతనానికి నిదర్శనం” అని మండిపడ్డారు. 

ఇక్కడి రైతులు పట్టరా?

రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలను కేసీఆర్​ సర్కార్​ ఎందుకు ఆపలేకపోతున్నదని బండి సంజయ్​ ప్రశ్నించారు. ‘‘ఇక్కడ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వకుండా, రాష్ట్ర ప్రజల సొమ్మును పంజాబ్ రైతులకు పంచడం ఎంత వరకు న్యాయం? చివరికి పంజాబ్ రైతులకు చెల్లని చెక్కులిచ్చి తెలంగాణ పరువు తీయడం వాస్తవం కాదా? రైతుల సంక్షేమానికి మోడీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నా...బద్నాం చేయడం ఏమిటి? అంతర్జాతీయ మార్కెట్​లో రైతులపై భారం పడకూడదనే.. సబ్సిడీపై తక్కువ ధరకు ఎరువులు అందిస్తున్న ఘనత మోడీ సర్కారుదే” అని ఆయన తెలిపారు. ‘‘రాష్ట్రంలో ఎరువుల కొరత ఉండొద్దనే రూ. 6 వేల కోట్లతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని కేంద్రం పునరుద్ధరించింది.  మోడీ హాజరైన ఆ ప్రోగ్రాంలో పాల్గొనకుండా ముఖం చాటేసిన సీఎం కేసీఆర్...ఇప్పుడు  కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాల గురించి మాట్లాడటం హాస్యాస్పదం” అని సంజయ్​ అన్నారు. 

పోలీస్ ఫిజికల్ టెస్ట్​లోని.. లోపాలు సవరించండి

రాష్ట్రంలో పోలీసు రిక్రూట్​మెంట్​లకు సంబంధించి ఫిజికల్ టెస్ట్ లోని లోపాలు, అవకతవకలను వెంటనే సవరించాలని సీఎం కేసీఆర్​కు బీజేపీ స్టేట్​చీఫ్, ఎంపీ బండి సంజయ్ శుక్రవారం లేఖ రాశారు. నోటిఫికేషన్ లో చెప్పిన దానికి భిన్నంగా ఫిజికల్​ టెస్టులు నిర్వహిస్తున్నారని అభ్యర్థుల నుండి పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయన్నారు. లాంగ్ జంప్, షాట్ పుట్ పరీక్షల్లో నోటిఫికేషన్ లో చెప్పిన దానికి భిన్నంగా వ్యవహరించడంతో దాదాపు 2లక్షల మంది అభ్యర్థులు అర్హత సాధించలేకపోయినట్లు తమ దృష్టికి వచ్చిందని లేఖలో పేర్కొన్నారు. పోలీసు ఉద్యోగాల నియమాక ప్రక్రియ మొదటి నుంచి వివాదాలకు తావిచ్చేలా ఉండటం దురదృష్టకరమని అన్నారు. ప్రిలిమినరీ ఎగ్జామ్ కటాఫ్ మార్కుల విషయంలోనూ అభ్యర్థులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. కొత్త నిబంధనలతో అభ్యర్థులను డిస్ క్వాలిఫై చేస్తున్నారన్నారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో లాంగ్ జంప్ డిస్టెన్స్ 3.8 మీటర్లు ఉంటే.. మన రాష్ట్రంలో మాత్రం 4 మీటర్లుగా నిర్ణయించడంతో అభ్యర్థులకు అన్యాయం జరుగుతున్నదని తెలిపారు. లాంగ్ జంప్ తో పాటు షాట్ పుట్ విషయంలో పాత విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. లాంగ్ జంప్ లో ఆన్ ది లైన్ ను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్​లో తప్పుగా ఇచ్చిన ప్రశ్నలకుగాను మార్కులు కలపాలని కోరారు. తప్పిదాలను సరిదిద్దుకుని అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.