సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ

సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ

పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ లో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కటాఫ్ మార్కుల్లో మినహాయింపు ఇవ్వాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. మోడీ ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రకుల పేదలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన సంగతిని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడం బాధాకరమన్న ఆయన... రాష్ట్ర ప్రభుత్వం తీరువల్ల ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. పోలీస్ రిక్రూట్ బోర్టు నోటిఫికేషన్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు కటాఫ్ మార్కుల్లో మినహాయింపు ఇచ్చి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మాత్రం ఇవ్వకపోవడం దారుణమని అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణమే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కూడా కటాఫ్ మార్కుల్లో మినహాయింపు ఇస్తూ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ ను సవరించాలని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు.

ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మినహాయింపు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ సీఎం కేసీఆర్ కు లేఖ రాసిన బండి సంజయ్.. ఈ నోటిఫికేషన్ లో ఎస్టీ, ఎస్టీలకు 20శాతం, బీసీలకు 25శాతం, జనరల్ అభ్యర్థులకు 30శాతం కటాఫ్ మార్కులుగా నిర్ణయించారని గుర్తుచేశారు. దీని వల్ల ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కూడా జనరల్ అభ్యర్థుల మాదిరిగా ప్రిలిమ్స్ లో 60, అంతకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వారే మెయిన్ పరీక్షకు అర్హులు కాగలరని తెలిపారు. కావున ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు మెయిన్ పరీక్ష రాసేందుకు ప్రిలిమ్స్ లో 25శాతం అంటే 50మార్కులను కటాఫ్ గా నిర్ణయించేలా తగు చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.