ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన తెలంగాణ విద్యార్థులు

ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన తెలంగాణ విద్యార్థులు

రష్యా దాడుల నేపథ్యంలో పలువురు భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్లో చిక్కుకుపోయారు. స్వదేశానికి తిరిగివచ్చేందుకు సిద్ధమైన 20 మంది తెలంగాణ విద్యార్థులు కీవ్ ఎయిర్పోర్టులో ఆగిపోయారు. ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశీయులంతా దేశాన్ని విడిచి వెళ్లాలని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్న విద్యార్థులు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అయితే ప్రభుత్వం అప్పటికే ఎయిర్ పోర్టుతో పాటు బయటకు వెళ్లే దారులన్నీ మూసివేసింది. దీంతో స్వదేశం తిరిగి రాలేక అటు యూనివర్సిటీకి వెళ్లలేక దాదాపు 20 మంది తెలుగు విద్యార్థులు భయంతో కాలం వెళ్లదీస్తున్నారు. 

ఉక్రెయిన్లోని మెడికల్ యూనివర్సిటీలో వైద్య విద్యను అభ్యసిస్తున్న 20మంది విద్యార్తులు ఎయిర్పోర్టులో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాము పడుతున్న కష్టాల గురించి కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. బాధిత విద్యార్థులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు ఫోన్ లో తమ మొర వినిపించడంతో ఆయన వెంటనే స్పందించారు. వారిని వెంటనే సురక్షితంగా భారత్ రప్పించేందుకు చర్యలు తీసుకోవాలంటూ విదేశీ వ్యవహారాల శాఖ కార్యాలయానికి లేఖ రాశారు. దీనిపై స్పందించిన అధిాకరులు ఉక్రెయిన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. విదేశాంగ శాఖ అధికారులతో టచ్ లో ఉన్న బండి సంజయ్ వారందరినీ సురక్షితంగా భారత్ కు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.