సర్పంచ్లకు తెలియకుండా నిధులు తీసిండ్రు.. కేంద్రమంత్రికి బండి సంజయ్ లేఖ

సర్పంచ్లకు తెలియకుండా నిధులు తీసిండ్రు.. కేంద్రమంత్రికి  బండి సంజయ్ లేఖ

గ్రామ పంచాయతీ నిధులపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. పంచాయతీ నిధులను కేసీఆర్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని.. దీనిపై విచారణ చేపట్టాలని కోరారు. 15వ ఆర్థిక సంఘం నిధులను అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించే అధికారం సర్పంచులకు మాత్రమే ఉంటుందన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం సర్పంచులకు తెలియకుండా డిజిటల్ కీతో విత్ డ్రా చేసిందని ఆరోపించారు.  

పంచాయతీ నిధులను నిబంధనలకు విరుద్ధంగా పాత బకాయిలు చెల్లించేందుకు వినియోగించారని లేఖలో సంజయ్ ఆరోపించారు. ఖాతాల్లో తిరిగి డబ్బు జమయ్యేలా చూడాలని సర్పంచులు తనకు వినతిపత్రం అందించారని పేర్కొన్నారు.  గ్రామ పంచాయితీలు, స్థానిక సంస్థలకు కేంద్రం విడుదల చేసిన నిధులను దారి మళ్లించడం కేసీఆర్ సర్కార్కు అలవాటుగా మారిందని విమర్శించారు. ఇటీవలె ఉపాధి హామీ పథకం నిధులు కూడా దారి మళ్లించి, ఇతర పథకాలకు వినియోగించినట్లు తన దృష్టికి వచ్చినట్లు లేఖలో ప్రస్తావించారు. వీటన్నింటిపై సమగ్ర విచారణ జరపాలని కేంద్రాన్ని ఆయన కోరారు.