పార్టీ క్యాడర్​ను అప్రమత్తం చేస్తున్న కేంద్ర హోంమంత్రి

పార్టీ క్యాడర్​ను అప్రమత్తం చేస్తున్న కేంద్ర హోంమంత్రి
  • ఇయ్యాల ముఖ్య నేతలతో భేటీ కానున్న బండి సంజయ్​

హైదరాబాద్, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు మునుగోడు బైపోల్​ను సెమీ ఫైనల్​గా భావిస్తున్న బీజేపీ.. ఈ ఉప ఎన్నికపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా... మునుగోడుపై ఎప్పటికప్పుడు పార్టీ క్యాడర్​ను అలర్ట్​ చేస్తున్నారు. ఏరోజుకారోజు నివేదికలు తెప్పించుకుంటున్నారు. పార్టీ ప్రచార తీరు, బీజేపీకి ప్రజల నుంచి వస్తున్న స్పందన, టీఆర్ఎస్ అధికార దుర్వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టిన అమిత్ షా... పార్టీ విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ సంస్థాగత రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ బన్సల్, రాజకీయ వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్​ చుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​తో మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ ట్రాప్​లో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ ప్రచారంలో ఢిల్లీ నుంచి ఎవరెవరు వచ్చారు, కేంద్ర మంత్రులను ఎవరినైనా ప్రచారం కోసం పంపించాలా అనే విషయాలపై  షా మాట్లాడుతున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఢిల్లీకి రావాల్సిందిగా బండి సంజయ్ కి బుధవారం రాత్రి హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో ఆయన హైదరాబాద్ నుంచి హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరారు. గురువారం పార్టీ ముఖ్య నేతలతో సంజయ్ భేటీ కానున్నారు. మునుగోడు ఉప ఎన్నికపై చర్చించేందుకే సంజయ్ కి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అమిత్ షా, నడ్డా, ఇతర ముఖ్య నేతలతో సంజయ్ సమావేశమై మునుగోడులో తాజా రాజకీయ పరిస్థితి, అక్కడ గెలుపు కోసం అనుసరిస్తున్న వ్యూహాలపై వివరిస్తారని పార్టీ నేతలు చెపుతున్నారు. ఉప ఎన్నికపై అమిత్ షా స్పెషల్ ఫోకస్ పెట్టిన సమయంలో సంజయ్​కి  హైకమాండ్ నుంచి పిలుపురావడం రాజకీయంగా మరింత ప్రాధాన్యం ఏర్పడింది.