ప్రధానితో బండి సంజయ్ భేటీ

ప్రధానితో బండి సంజయ్ భేటీ
  •     కరీంనగర్ కార్పొరేషన్ లో బీజేపీ విజయంపై మోదీ సంతోషం
  •     పేదలకు కేంద్ర సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేయాలని సూచన

న్యూఢిల్లీ, వెలుగు: ప్రధానమంత్రి నరేంద్రమోదీని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం పార్లమెంట్ సమావేశాలు ముగిసిన అనంతరం ప్రధానితో సంజయ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా.. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ను బీజేపీ కైవసం చేసుకొన్న విషయం వీరి మధ్య ప్రస్తావనకు రాగా,  ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. 

మున్సిపల్ ఎన్నికల్లో కేంద్ర నిధులు, అభివృద్ధి నినాదంతోనే ప్రజల్లోకి వెళ్లామని ఈ సందర్భంగా మోదీకి సంజయ్ వివరించారు. దీంతోపాటు ‘‘మోదీ గిఫ్ట్’’ పేరుతో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ స్కూళ్లలో టెన్త్ విద్యార్ధులందరికీ ఉచితంగా బ్రాండెడ్ సైకిళ్లను అందించిన అంశాన్ని ప్రస్తావించారు. 

నూతనంగా గెలిచిన కరీంనగర్ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధుల పక్షాన ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని ‘‘ప్రజలకు నిరంతరం సేవ చేయడంలోనే తృప్తి ఉంటుంది. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు కృషి చేయండి. అట్టడుగు వర్గాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో నిర్విరామంగా పనిచేయండి’’అని సూచించారని బండి సంజయ్ ఒక ప్రకటనలో తెలిపారు.