సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ

సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ

రాష్ట్ర  రైతాంగ సమస్యలపై సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో సీఎం కేసీఆర్ ను  ఫామ్‌హౌస్‌ ముఖ్యమంత్రిగా అభివర్ణించారు. 8 ఏళ్ల కేసీఆర్‌ పాలన రైతుల కంట కన్నీరు `కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ పంట పన్నీరుగా మారిందని విమర్శించారు.కేంద్రం సహా ప్రధాని మోడీపైన గోబెల్స్‌ ప్రచారం చేయడం ఇకనైనా ఆపాలన్నారు.  వరిసహా 14 పంటలకు కనీస మద్ధతు ధరను పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపట్ల మోడీకి ధన్యవాదాలు తెలిపిన బండి సంజయ్‌.. ప్రధానిని ఆదర్శంగా తీసుకొని రైతుల సంక్షేమాన్ని పట్టించుకోవాలని కేసీఆర్ కు సూచించారు.7500 కోట్ల రైతుబంధు నిధులను రైతుల ఖాతాలో వెంటనే జమచేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రైతు రుణమాఫీని పూర్తిగా అమలు చేయాలన్నారు.

 సీఎం వ్యక్తిగత ప్రచారానికి, మంత్రి కేటీఆర్‌ విదేశీ పర్యటనకు కోట్ల నిధులు వెచ్చిస్తున్న ప్రభుత్వం రైతుబంధుకు, రైతు రుణమాఫీకి సకాలంలో నిధులు కేటాయించకపోవడం బాధాకరమన్నారు. సకాలంలో రైతుబంధు నిధులు రాక రైతులు అధిక వడ్డీలకు రుణం తెచ్చుకుని అప్పుల పాలవతున్నారని చెప్పారు. కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద కేంద్రం ఇప్పటి వరకు తెలంగాణలో 5800 కోట్ల రూపాయల నిధులను జమచేసి రైతులను ఆదుకుందని తెలిపారు. ఈ ఏడాదికి సంబంధించి 580 కోట్ల కిసాన్‌ సమ్మాన్‌ నిధులను మే 31న కేంద్రం రైతుల ఖాతాల్లో జమచేసినట్లు ఆయన వివరించారు. ఇక సాయిల్ హెల్త్ కార్డులను రైతులకు వెంటనే అందజేయాలన్నారు.