
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర మొదలైంది. సూరారం కాలనీలోని రామ్ లీలా మైదానం నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పిలుపు మేరకు పెద్ద ఎత్తున కుత్బుల్లాపూర్ బీజేపీ శ్రేణులు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. కాసేపట్లో సుభాష్ నగర్ బస్ డిపో వద్ద బీజేపీ జెండాను సంజయ్ ఆవిష్కరించనున్నారు. అంతకుముందు బండి సంజయ్ హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి బయలుదేరి గాజులరామారంలోని చిత్తారమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ర్యాలీగా వెళ్లి సూరారంలోని కట్ట మైసమ్మ ఆలయాన్ని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుత్బుల్లాపూర్ లో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభలో మాట్లాడారు.
పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్డు దాకా..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మొదలైన నాలుగో విడత పాదయాత్ర... ఈ నెల 22న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ముగియనుంది.10 రోజుల పాటు 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 115 కిలోమీటర్ల మేర సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది. ఈ నెల 17న పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నందున ఆ రోజున పాదయాత్ర ఉండదు. కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, సికింద్రాబాద్–కంటోన్మెంట్, మల్కాజిగిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల మీదుగా సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది.