
కరీంనగర్ : రైతును రాజుగా చూడాలన్నదే మోడీ సర్కారు లక్ష్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మానకొండూరు మండలం అన్నారం గ్రామంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్దిదారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్.. నరేంద్రమోడీ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసంఎంతగానో పాటు పడుతోందని చెప్పారు. మోడీ సర్కారు చొరవ వల్లే కేంద్ర ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు చేరుతున్నాయని అన్నారు. ఎరువులపై సబ్సిడీ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమేనన్న విషయాన్ని బండి సంజయ్ స్పష్టంచేశారు. మోడీ సర్కారు కిసాన్ సమ్మాన్ నిధితో పాటు దేశంలోని ప్రతి రైతుకు ఏడాదికి రూ.30వేల లాభం చేకూర్చుతోందని, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.