బండి సంజయ్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి : బీసీ-ఏ హక్కుల పరిరక్షణ సమితి

బండి సంజయ్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి :   బీసీ-ఏ హక్కుల పరిరక్షణ సమితి
  •     బీసీ-ఏ హక్కుల పరిరక్షణ సమితి డిమాండ్‌‌

బషీర్‌‌బాగ్, వెలుగు: ముదిరాజ్‌‌ కులాన్ని బీసీ- డీ నుంచి బీసీ- ఏ లోకి మార్చాలంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌‌ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని తీసుకోవాలని బీసీ -ఏ కులాల హక్కుల పరిరక్షణ సమితి డిమాండ్‌‌ చేసింది. ఆదివారం బషీర్‌‌బాగ్‌‌ ప్రెస్‌‌క్లబ్‌‌లో సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్‌‌ ఎం.భాగయ్య, అధ్యక్షుడు గడప శ్రీహరి, ప్రధాన కార్యదర్శి టి.నారాయణ మాట్లాడుతూ ఎంబీసీ కులాల హక్కులను విస్మరించి కొన్ని కులాలకే ప్రాధాన్యం ఇచ్చేలా బండి సంజయ్‌‌ మాట్లాడడం సరికాదన్నారు. 

పుట్టుక నుంచి చావు వరకు సమాజానికి సేవలందించే చేతివృత్తులు, యాచక వృత్తులపై ఆధారపడిన 56కుపైగా బీసీ -ఏ ఉపకులాల హక్కులను నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బీసీ కులాల మధ్య విభజన సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కేంద్ర మంత్రి హోదాలో బండి సంజయ్‌‌ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.