ప్రజల సొమ్మును సీఎం ఫ్యామిలీ దోచుకుంటోంది: సంజయ్

ప్రజల సొమ్మును సీఎం ఫ్యామిలీ దోచుకుంటోంది: సంజయ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రజల సొమ్మును సీఎం కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్ మండిపడ్డారు. కొత్త సెక్రటేరియెట్ నిర్మాణంలో రూ.వెయ్యి కోట్లు దండుకున్నారని ఆయన ఆరోపించారు. “దళితబంధు పథకంలో 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారని మంత్రులు, ఎమ్మెల్యేలను కేసీఆర్ తిట్టారు. మరి కమీషన్లు తీసుకుంటే ఎందుకు అడ్డుకోలేదు. సీఎం అడ్డుకోలేదంటే ఆయనకూ వాటా ఉన్నట్లే కదా! ప్రాజెక్టులు, స్కీమ్​ల పేరుతో  కేసీఆర్ కుటుంబం వేల కోట్లు దోచుకుంటుంటే.. ఎమ్మెల్యేలు కూడా కమీషన్లు తీసుకుంటూ ఆయన బాటలోనే నడుస్తున్నారు. ఒకామెకు దళితబంధు కింద రూ.10 లక్షలు మంజూరైతే, ఆమెకు ఒక్క లక్ష మాత్రమే ఇచ్చి రూ.9 లక్షలు ఎమ్మెల్యే కమీషన్ తీసుకున్నారట. అట్లుంటది కేసీఆర్ పాలన” అని విమర్శించారు. ఆదివారం ప్రధాని మోడీ 100వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని.. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఉదయ్ నగర్, 216వ పోలింగ్ బూత్ లో సంజయ్ వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మోడీ రోజుకు18 గంటలు పని చేస్తుంటే, కేసీఆర్ మాత్రం 4 గంటలు కూడా పని చేస్తలేరని విమర్శించారు. కేసీఆర్ ఏనాడూ ప్రజల కష్టాలు తెలుసుకోలేదని ఫైర్ అయ్యారు. కుక్కల దాడుల్లో, నాలాల్లో పడి పిల్లలు చనిపోయినా పట్టించుకోలేదని, కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించలేదని మండిపడ్డారు. 

సమాజానికి స్ఫూర్తినిచ్చేలా మన్ కీ బాత్.. 

ప్రధాని మోడీ మన్ కీ బాత్ సమాజానికి స్ఫూర్తినిచ్చేలా ఉందని సంజయ్ అన్నారు. ఆయన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎన్నో అంశాలను ప్రస్తావించారని చెప్పారు. ‘‘మోడీ ‘మన్ కీ బాత్’ పేరుతో ప్రజలను ఉద్దేశించి 100 సార్లు మాట్లాడటం చాలా గొప్ప విషయం. ఇది ప్రపంచ రికార్డు. గతంలో అమెరికా అధ్యక్షుడు 72 ఎపిసోడ్లు చేస్తే.. మోడీ ఏకంగా 100 ఎపిసోడ్లు పూర్తి చేశారు” అని తెలిపారు. 

ఆర్టీసీ కార్మికులు కొట్లాడాలె.. 

ఆర్టీసీ ఆస్తులను కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని సంజయ్ ఆరోపించారు. సంస్థ ఆస్తులను తమ పార్టీ ఎమ్మెల్యేలకు లీజుకు ఇస్తూ దోచిపెడుతోందని మండిపడ్డారు. “ఆర్మూర్ బస్టాండ్ కాంప్లెక్స్ ను లోకల్ ఎమ్మెల్యేకు లీజుకు ఇచ్చారు. ఆయన ఇప్పటి వరకు రూ.7 కోట్ల కిరాయి బకాయిలు కట్టనేలేదు. ఆర్టీసీతో బీఆర్ఎస్ లీడర్లకు బెనిఫిట్ జరుగుతున్నది తప్ప.. కార్మికులకు జరగడం లేదు” అని అన్నారు. భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) ఆధ్వర్యంలో ఆదివారం కాచిగూడలో ఆర్టీసీ కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో సంజయ్ పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ వ్యూహాత్మకంగానే ఆర్టీసీని దివాళా తీయిస్తూ ఉద్యోగులపై కక్ష సాధింపుచర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.  ‘‘ఆర్టీసీ కార్మికులారా... తెలంగాణ ఉద్యమం నాటి తెగువను చూపండి. కేసులు పెట్టినా, ఉద్యోగాల నుంచి తొలగించినా భయపడకండి. మీకు అండగా మేమున్నాం. రోడ్లపైకి వచ్చి కొట్లాడండి” అని పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక కేసీఆర్ సర్కార్ తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మీడియాను అణచివేయాలని చూస్తున్నరు.. 

సెక్రటేరియెట్ ప్రారంభోత్సవానికి వీ6, వెలుగు సహా కొన్ని మీడియా సంస్థలకు పాసులు ఇవ్వకపోవడంపై సంజయ్ మండిపడ్డారు. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపే మీడియా సంస్థలను అణచివేయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. మీడియాను అణచివేయాలని చూసిన పాలకులంతా కాలగర్భంలో కలిసిపోయారని, కేసీఆర్ కూ అదే గతి పడుతుందని హెచ్చరించారు. ‘‘వీ6, వెలుగు ఏం తప్పు చేశాయని ఆంక్షలు పెట్టినవ్? తెలంగాణ ఉద్యమం టైమ్ లో వీ6 పాత్ర గొప్పది అంటివి.. ఇప్పుడు నీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తట్టుకోలేక ఆంక్షలు పెడ్తివి” అని కేసీఆర్ పై మండిపడ్డారు. మీడియా సంస్థలపై ఆంక్షలు పెడుతుంటే, జర్నలిస్ట్ సంఘాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు.