నిజాం రాక్షస పాలన ప్రజలకు తెలియాలి : ఎంపీ బండి సంజయ్‌‌

నిజాం రాక్షస పాలన ప్రజలకు తెలియాలి : ఎంపీ బండి సంజయ్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: నిజాం రాక్షస పాలనలో వాస్తవాలను ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంలో రజాకార్ సినిమా తీస్తున్నందుకు అభినందనలని కరీంనగర్‌‌ ఎంపీ బండి సంజయ్‌‌ అన్నారు. శుక్రవారం హైదరాబాద్​లోని జలవిహార్​లో రజాకార్ మూవీ పోస్టర్ రిలీజ్ కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథులుగా మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, ఎంపీ బండి సంజయ్ హాజరై పోస్టర్​ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంజయ్‌‌ మాట్లాడుతూ, కశ్మీర్ ఫైల్స్ సినిమా చూసిన తరువాత పాతబస్తీ ఫైల్స్ తీయాలని గూడూరు నారాయణరెడ్డికి సూచించాననీ, అదే సమయంలో రజాకార్ ఫైల్స్‌‌ పై చర్చ జరిగిందనీ, చివరకు రజాకార్ సినిమాను తీయాలని నిర్ణయించారని తెలిపారు. 

రజాకార్ సినిమా ద్వారా నిజమైన చరిత్రను చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నిజాంపై పోరాట చరిత్రతోపాటు నేటి తెలంగాణ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించే కుట్ర జరుగుతోందన్నారు. కొందరు మేమే పోటుగాళ్లమని ప్రచారం చేసుకుంటూ సొంత చరిత్ర చెప్పుకునే పనిలో పడ్డారని విమర్శించారు. ఓయూ, చార్మినార్​లను చూపించి నిజాం పాలనను గొప్పగా చిత్రీకరించే యత్నం చేస్తున్నారన్నారు. మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డైరెక్టర్ బి.గోపాల్, సినిమా ప్రొడ్యూసర్ గూడూరు నారాయణరెడ్డి, డైరెక్టర్‌‌ యాట సత్యనారాయణ,- నటులు లక్ష్ చెదలవాడ, వేదిక, బాబీ సింహా, సందీప్ పాల్గొన్నారు.