కేసీఆరే కాంగ్రెస్​ను..నడిపిస్తున్నడు

 కేసీఆరే కాంగ్రెస్​ను..నడిపిస్తున్నడు
  • ఆయన ఓటమే ధ్యేయమనేటోళ్లు కాంగ్రెస్​లోకి ఎట్ల పోతరు?: సంజయ్ 
  • ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావు.. అది మునిగిపోయే నావ 
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రజల్లో విలువ లేదని కేటీఆరే అంటున్నడు 
  • ఆత్మాభిమానం ఉంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆత్మవిమర్శ చేసుకోవాలె 
  • లక్సెట్టిపేట బహిరంగ సభలో బీజేపీ స్టేట్ చీఫ్
  • కమీషన్ల కోసమే ప్రాజెక్టులు కడ్తున్నరు.. డబుల్ బెడ్రూం ఇండ్లకు 
  • నిధులు ఎందుకియ్యరు?: వివేక్ వెంకటస్వామి 

మంచిర్యాల, వెలుగు:  కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని బీజేపీ స్టేట్​చీఫ్ సంజయ్ కామెంట్ చేశారు. ‘‘బీఆర్ఎస్, కాంగ్రెస్​ఒక్కటే. కాంగ్రెస్ ను నడిపిస్తున్నది కేసీఆరే. అలాంటప్పడు కేసీఆర్ ను ఓడించడమే ధ్యేయమని చెబుతున్న నేతలు.. కాంగ్రెస్ లోకి ఎందుకు వెళ్లాలనుకుంటున్నారో ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా రావడం లేదు. దుబ్బాక నుంచి మునుగోడు ఎన్నికల వరకు ఆ పార్టీ అడ్రస్ గల్లంతైంది. అలాంటి పార్టీలోకి కొందరు వెళ్లాలనుకుంటున్నారు” అని అన్నారు. బీజేపీని కొట్టే దమ్ము బీఆర్ఎస్ కు లేదని, కేసీఆర్ అందుకే కాంగ్రెస్ తో కలిసి వస్తున్నాడని చెప్పారు. ‘‘కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు వేసినట్లే. 

కాంగ్రెస్ నుంచి పొరపాటున గెలిస్తే, వాళ్లంతా బీఆర్ఎస్ లోకి వెళ్తారు. బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుందని జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డే చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని ప్రజలకు అర్థమైంది” అని అన్నారు. బీఆర్ఎస్ ను ఓడించే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని, ప్రజలంతా తమకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చినంక పేదలకు ఇండ్లు కట్టిస్తామని, ఉచిత విద్య, వైద్యం అందిస్తామని, జాబ్ క్యాలెండర్ ను ప్రకటించి ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా బుధవారం లక్సెట్టిపేటలోని గవర్నమెంట్ జూనియర్​కాలేజీ గ్రౌండ్​లో మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గ బహిరంగ సభ నిర్వహించారు. 

ఇందులో సంజయ్ పాల్గొని మాట్లాడారు.  ‘‘పదవులు శాశ్వతం కాదు. నేను పదవుల కోసం పని చేయడం లేదు. జేపీ నడ్డా ఫోన్ చేసి.. తప్పుకో అంటే బిస్తర్ పట్టుకుని ఎక్కడ పని చేయమంటే అక్కడ పనిచేస్త. మా బలం కార్యకర్తలే. మా లక్ష్యం కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే. నిజమైన ఉద్యమకారులంతా బీజేపీకి మద్దతు తెలపాలి” అని పిలుపునిచ్చారు. బీజేపీ పోరాటాలకు భయపడే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిందని అన్నారు. 

మహిళలను వేధిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. 

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రజల్లో విలువ లేదని కేటీఆరే చెబుతున్నారని సంజయ్ అన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఆత్మాభిమానం ఉంటే ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. ‘‘ఎమ్మెల్యేలు మందు, మనీ పంచి గెలుస్తున్నరట. కేసీఆర్ కొడుకు మాత్రం పంచరట. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సిగ్గుండాలె.. మీ ముఖాలను చూసి జనం ఓట్లు వేయడం లేదట. ప్రజల్లో మీకు విలువ లేదని కేసీఆర్ కొడుకు అంటుంటే స్పందించరా? ఆత్మాభిమానమున్న వాళ్లు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈసారి కేసీఆర్ ఫొటో పెట్టుకుని ఓట్లు అడిగితే జనం మీ సంగతి చెప్పడం ఖాయం” అని హెచ్చరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ‘‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దారిలో పోతుంటే మహిళలు ఇండ్లలోకి పోయి దాక్కునే పరిస్థితి వచ్చింది. మంచిర్యాల జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఆడోళ్ల వెంట పడుతున్నడు. మరో ఎమ్మెల్యే ఇసుకను చక్కెర లెక్క బుక్కుతున్నడు. ఇంకో ఎమ్మెల్యే రైతుల మీద పడి దోచుకుంటున్నడు” అని మండిపడ్డారు. 

ఇంకో ఐదు నెలలు ఇట్లనే జోష్ ఉండాలె.. 

‘‘మంచిర్యాల ప్రజల్లో మస్త్ జోష్ కన్పిస్తున్నది. ఈ జోష్ ఇంకా ఐదు నెలలుండాలే. కేసీఆర్ అంతుచూద్దాం” అని సంజయ్ అన్నారు. ‘‘బీజేపీ సభలకు జనం భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. కానీ బీఆర్ఎస్ మీటింగ్ లకు జనాలే రావడం లేదు. ఒక్కొక్కరికి ఫుల్ బాటిల్, వెయ్యి రూపాయలు ఇస్తామన్నా కూడా ప్రజలు పట్టించుకోవడం లేదు” అని చెప్పారు. ‘‘ప్రధాని మోదీ పేదల కోసం పని చేస్తున్నరు. పీఎం ఆవాస్ యోజన కింద 3 కోట్ల మందికి ఇండ్లు కట్టించారు. మరి కేసీఆర్ ఏం చేసిండు? లక్సెట్టిపేటలో ఒక్కరికైనా డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చిండా? మోదీ ప్రభుత్వం తెలంగాణకు 2.5 లక్షల ఇండ్లు మంజూరు చేస్తే కేసీఆర్​ఎందుకు కట్టియ్యలేదు. 

మంచిర్యాల ప్రజలు చేసిన పాపమేంది? కేసీఆర్ సహా బీఆర్ఎస్ నేతల గల్లా పట్టి అడగండి” అని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘వడ్ల కొనుగోలు పైసలన్నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నవే. పల్లె ప్రగతి, శ్మశానవాటికలు, వడ్డీలేని రుణాలు సహా అన్నీ మోదీ ఇస్తున్నప్పటికీ కేసీఆర్ సిగ్గులేకుండా తన ఫొటోలు పెట్టుకుంటున్నాడు” అని మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నిధులిస్తున్నా, కేసీఆరే సహకరించడం లేదన్నారు. జనమంతా 90909 02024 నంబర్ కు మిస్డ్​కాల్​ఇచ్చి బీజేపీకి మద్దతు తెలపాలని కోరారు. సభలో మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్​రావు, పాయల్ శంకర్  తదితరులు పాల్గొన్నారు.

అమరుల త్యాగాలతోనే తెలంగాణ.. 

కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశారని సంజయ్ మండిపడ్డారు. రుణమాఫీ, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్రూం ఇండ్లు, పోడు పట్టాలు సహా అనేక హామీలిచ్చి మోసం చేశారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్​పాలనలో ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. ‘‘గూడెం లిఫ్ట్ పైపుల్లో అవినీతి ఏరులైపారుతోంది. 85 సార్లు పైపులు పగిలినయంటే ఎట్లుందో అర్థం చేసుకోవచ్చు. ఎల్లంపల్లి ప్రాజెక్టు, రాయపట్నం బ్రిడ్జి వద్ద టూరిజం అభివృద్ధి  చేస్తానని మోసం చేశారు. మంచిర్యాల, అంతర్గాం మధ్య గోదావరి బ్రిడ్జి నిర్మాణం ముందుకు సాగడం లేదు” అని అన్నారు. కేవలం కేసీఆర్ తోనే తెలంగాణ రాలేదని, సబ్బండ వర్గాలు కొట్లాడితేనే వచ్చిందని అన్నారు. “తెలంగాణపై ఓటింగ్ జరిగినప్పుడు కేసీఆర్ పార్లమెంట్ కు రాలేదు. ఖమ్మంలో దొంగ దీక్ష చేసిండు. సిగ్గు లేకుండా ‘చావు నోట్లో తలకాయ పెట్టి వచ్చిన’ అని చెప్పుకుంటున్నడు. 1,400 మంది ప్రాణత్యాగంతో తెలంగాణ వచ్చింది. పేదోళ్ల చావులతో తెలంగాణ వస్తే.. ఇయ్యాల పెద్దోళ్లు పెత్తనం చెలాయిస్తున్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబం చేసిన త్యాగమేందో చెప్పాలి” అని డిమాండ్ చేశారు.