లిక్కర్ స్కామ్‌‌లో కవిత ఇరుక్కుంటే మహిళలు నిప్పులు కురిపించాలా?

లిక్కర్ స్కామ్‌‌లో కవిత ఇరుక్కుంటే మహిళలు నిప్పులు కురిపించాలా?

జగిత్యాల/కొండగట్టు, వెలుగు: 2018లో కొండగట్టు వద్ద బస్సు ప్రమాదం జరిగి 68 మంది చనిపోయారని, కానీ బాధితులను ఇప్పటిదాకా కేసీఆర్ పరామర్శించలేదని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు. ఈ దుర్ఘటన బాధితులకు పూర్తిస్థాయిలో పరిహారం అందలేదని చెప్పారు. బాధితుల శాపం ఊరికే పోదని, వారి పాపం తగిలే కేసీఆర్ డౌన్​ఫాల్ స్టార్టయ్యిందని అన్నారు. 

ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా మంగళవారం జగిత్యాల జిల్లా కొండగట్టులో బస్సు ప్రమాద బాధితుల కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా బాధితులు తమ గోడు వెల్లబోసుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తే బాధలు చెప్పుకుందామనుకున్న బాధితులను నిర్బంధించారని, వారేమైనా తీవ్రవాదులా అని సంజయ్ ప్రశ్నించారు. బాధితులకు న్యాయం చేయని సీఎం.. జాతీయ పార్టీ పెట్టి దేశంలో చక్రం తిప్పుతాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బాధితులను ఆదుకోని కేసీఆర్.. కొండగట్టు ఆలయ అభివృద్ధికి వంద కోట్లు ఇస్తామంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారు. ప్రమాద బాధితులకు న్యాయం చేయాలని, బాధిత కుటుంబ సభ్యులకు ఆర్టీసీలో ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ప్రశ్నించేటోళ్లను బెదిరిస్తుండు

తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం మానవ హక్కులను కాలరాస్తున్నదని ఎమ్మెల్సీ కవిత చేసిన కామెంట్లపై సంజయ్​ఘాటుగా స్పందించారు. రాజ్యాంగాన్ని మారుస్తానన్న కేసీఆర్.. ప్రశ్నించే వాళ్లను జైల్లో వేస్తున్నారని, ఇప్పుడు వాళ్లే హక్కుల గురించి మాట్లాడడం వింతగా ఉందన్నారు. తన మాటలు కవితకు బాధనిపిస్తే తన తండ్రి వద్దకెళ్లి ఏడవాలని ఎద్దేవా చేశారు. తెలంగాణ మహిళల కండ్లలోంచి నీళ్లు కాదు నిప్పులు వస్తాయన్న కవిత కామెంట్లపై సంజయ్ స్పందించారు. ‘‘కొండగట్టు ప్రమాదంలో మహిళలు, గర్భిణులు చనిపోయినప్పుడు నీ కళ్లలో నిప్పులు ఎందుకు రాలేదు? రూ.లక్షల కోట్ల అవినీతి సొమ్ముతో లిక్కర్ దందా చేసి ఇరుక్కుంటే.. మహిళలంతా నిప్పులు కురిపించాలా?” అని ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతిని ఎండగడుతూ నిజాలు రాసే మీడియాను తొక్కేస్తున్నాడని, ప్రశ్నించే కవులు, కళాకారులు, మేధావులను బెదిరిస్తున్నాడని ఆరోపించారు. ప్రెస్ మీట్ పెడితే రిపోర్టర్లను దబాయిస్తున్నదెవరో, కేసీఆర్ సీఎం అయిన వెంటనే ప్రశ్నించే చానళ్లు ఎందుకు మూతపడ్డాయో అందరికీ తెలుసన్నారు. కేసీఆర్, ఆయన కుటుంబం సాగిస్తున్న అవినీతి పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు.

బెంగళూరు డ్రగ్స్ కేసులో రోహిత్‌‌రెడ్డి

కొడిమ్యాల మండలం పూడూర్‌‌‌‌లో మీడియాతో చిట్ చాట్‌‌లో బండి సంజయ్ మాట్లాడారు. బెంగుళూరు డ్రగ్స్ కేసును తిరిగి ఓపెన్ చేస్తే చాలా విషయాలు బయట పడతాయని చెప్పారు. బెంగుళూరు డ్రగ్స్ కేసులో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఉన్నాడని ఆరోపించారు. డ్రగ్స్ కేసు విచారిస్తున్న కొందరు బెంగళూరు అధికారులు సీఎంవోకు లీక్ చేయడంతో.. కేసీఆర్ హడావుడిగా రోహిత్ రెడ్డితో ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై స్టేట్‌‌మెంట్ రికార్డ్ చేయించారని విమర్శలు చేశారు. డ్రగ్స్ కేసులో కర్నాటక ప్రభుత్వం నుంచి రోహిత్ రెడ్డికి గతంలో నోటీస్ వచ్చిందని, డ్రగ్స్ కేసు బయటకు వస్తే ఎమ్మెల్యే మాట వినడని, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో వాస్తవాలు బయట పెడతాడని సీఎం భయపడుతున్నాడని అన్నారు.