సింగరేణిపై టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం: సంజయ్​

 సింగరేణిపై టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం: సంజయ్​

హైదరాబాద్, వెలుగు: సింగరేణిని ప్రైవేటైజేషన్ చేసేది లేదని ప్రధాని మోడీ స్పష్టత ఇచ్చినా టీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ స్టేట్​చీఫ్ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. ముందు ప్రైవేటైజేషన్ కు, బొగ్గు గనుల వేలానికి మధ్య తేడా తెలుసుకోవాలని ఆదివారం ట్వీట్ ద్వారా టీఆర్ ఎస్ నేతలకు సూచించారు. 50 శాతం పైగా వాటా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంటేనే ప్రైవేటైజేషన్ సాధ్యమని ఆయన గుర్తు చేశారు. కేంద్ర కోల్ మంత్రి ప్రహ్లద్ జోషి ట్వీట్ కు సంజయ్ రీ ట్వీట్ చేశారు.

సింగరేణి లో 51% వాటా రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉందన్నారు. “టీఆర్ఎస్ డ్రామా ఆన్ సింగరేణి ”అనే హ్యాష్ ట్యాగ్ ను యాడ్ చేశారు. 2015 లో నైనీ బ్లాక్ సింగరేణికి దక్కిందని, కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు ఇచ్చిందని, అయినా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం పనులు స్టార్ట్ చేయలేదని సంజయ్ తెలిపారు. 5 గనులకు వేలం పాట జరిగితే కేవలం ఒక వేలంలో మాత్రమే సింగరేణి పాల్గొన్నదని గుర్తు చేశారు. ఇప్పటికైనా అన్ని వేలం పాటలలో సింగరేణి పాల్గొనేలా అనుమతులు ఇచ్చి, సింగరేణి అభివృద్ధికి రాష్ట్ర సర్కార్ తోడ్పడాలని సూచించారు. రెవెన్యూ పెరిగేందుకు, సింగరేణి విస్తరణకు ఈ చర్యలు అవసరమన్నారు.